రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు: కేటీఆర్
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:15 PM
2023 తర్వాత బీఆర్‌ఎస్‌కు చాలా షాక్‌లు తగిలాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని.. కేసీఆర్‌కు రెండోసారి ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘అధికారం రావడం, పోవడం రొటీన్‌గా జరిగేదే. నాయకులు, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ.. ప్రజల స్థితిగతులు మారుతున్నాయా లేదా అని ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో పాటు.. బీఆర్ఎస్ మాత్రమే నిలబడ్డాయి. అధికారం మనకేమీ కొత్త కాదు’ అని మాజీ మంత్రి అన్నారు.
గత ఎన్నికల సమయంలో ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పారని.. తొందరపడవద్దని, ఆగమై ఓటు వేయొద్దని అన్నారని మాజీ మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డికి.. తనకు వ్యక్తిగత పంచాయతీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కల్వకుర్తిలో సర్వే చేయించామని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఓడిపోతారని క్లియర్‌గా చెప్పారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార మార్పిడి కావాలని చాలామంది చెప్పారని తెలిపారు. 2023 తర్వాత బీఆర్‌ఎస్‌కు చాలా షాక్‌లు తగిలాయన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కేసీఆర్‌కు రెండోసారి ఫ్రాక్చర్ జరిగింది. మన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్లిపోయారు’ అని కేటీఆర్ తెలిపారు.
గతంలో కేసీఆర్ రైతుబంధు ఇస్తుంటే.. ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని? పెద్ద రైతులకు ఎందుకు ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎన్ని విమర్శలు వచ్చినా రైతుబంధును కేసీఆర్ ఆపకుండా ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ గెలిస్తే చాలు.. ఈ ఎమ్మెల్యే తమకొద్దని అనుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టడం వల్లే కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల
టీఆర్‌ఎస్ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి
Read Latest Telangana News And Telugu News