కృష్ణా జలాలపై మళ్లీ పీటముడి!
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:54 AM
కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీపై మళ్లీ పీటముడి నెలకొనే అవకాశాలున్నాయి. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో చెరి సగం పంచాలని తెలంగాణ కోరుతుండగా... ఏపీ మాత్రం 66:34 నిష్పత్తి (ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం)తో పంచాలనే డిమాండ్‌ను బోర్డు ముందు పెట్టింది.
చెరి సగం పంచాలంటున్న తెలంగాణ..
66:34 నిష్పత్తితో కావాలంటున్న ఏపీ
26న బోర్డు సమావేశం.. అజెండా విడుదల
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీపై మళ్లీ పీటముడి నెలకొనే అవకాశాలున్నాయి. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో చెరి సగం పంచాలని తెలంగాణ కోరుతుండగా... ఏపీ మాత్రం 66:34 నిష్పత్తి (ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం)తో పంచాలనే డిమాండ్‌ను బోర్డు ముందు పెట్టింది. ఈనెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనుంది. ఇందులో చర్చించే అంశాల అజెండాను శుక్రవారం తెలుగు రాష్ట్రాలకు బోర్డు పంపింది. అయితే కృష్ణా ట్రైబ్యునల్‌లో బేసిన్ పారామీటర్ ప్రకారం 71 శాతం జలాలను తమకు కేటాయించాలని కోరుతున్నామని, నీటి పంపకాలు తేల్చేదాకా 50:50 నిష్పత్తితో కేటాయించాలని తెలంగాణ బోర్డుకు విన్నవించింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన 30.869 టీఎంసీలే ఉండగా, తాగునీటి అవసరాల సాకుతో సాగర్ నుంచి 10 టీఎంసీలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించడానికి కృష్ణా బోర్డు నుంచి ఏపీ ఉత్తర్వులు పొందిందని, ఎల్‌నినో వల్ల ఈ నిర్ణయం సంక్షోభానికి దారి తీయనుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 45.79 టీఎంసీల జలాలను ఇతర బేసిన్లకు తరలించిందని తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ వివాదం పరిష్కార బాధ్యతలను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించాలని మరోసారి తీర్మానం చేయాలని తెలంగాణ కోరింది.
ఇటు శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు ఏపీ లైనింగ్ చేస్తుండడంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం భారీ మొత్తంలో నీళ్లను తరలించుకునే అవకాశముందని, ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, బనకచర్ల కాంప్లెక్స్ ఔట్‌లెట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పోలవరం-బనకచర్ల/పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును నిలువరించాలని, ఆ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేసింది.
66:34 నిష్పత్తితోనే పంచాలి: ఏపీ
ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తితో కృష్ణా జలాల పంపిణీ జరగాలని, 50:50 నిష్పత్తికి అంగీకరించబోమని ఏపీ చెబుతోంది. శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోతున్న నిల్వలను పరిరక్షించడానికి తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేసేలా తెలంగాణకు, తెలంగాణ జెన్‌కోకు ఆదేశాలు జారీ చేయాలని, శ్రీశైలం, సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని బోర్డును కోరింది. తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇంటెక్‌వెల్, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి అదనపు 15 టీఎంసీల పథకం, అచ్చంపేట, నారాయణపేట-కొడంగల్, జవహర్ ఎత్తిపోతల, రేలంపాడు సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు ద్వారా గూడెందొడ్డి, రేలంపాడులో అదనంగా 15 టీఎంసీల నిల్వలు, రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల, నక్కగూడెం ఎత్తిపోతల, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, 50 టీఎంసీల మున్నేరు-పాలేరు లింక్‌కాల్వ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News