కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఎక్కడ?: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:55 PM
హైదరాబాద్‌లోని కాచిగూడ డివిజన్‌లో పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డికి రహస్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తామని చెప్పారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ సంస్థలు లేవా? లేక విచారణను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందా? అని నిలదీశారు. బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులను విమర్శించే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
సింగరేణి భరోసా యాత్ర
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోమవారం నుంచి రెండు రోజుల పాటు 'సింగరేణి భరోసా యాత్ర' నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ యాత్రలో బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారని తెలిపారు.
కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన పాదయాత్ర అనంతరం కిషన్ రెడ్డి.. పలు కీలక విషయాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి శనివారం, ఆదివారం బస్తీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటున్నారని చెప్పారు.
అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో బస్తీలను సందర్శించిన సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రహదారులు దెబ్బతిన్నాయని, వీధిలైట్లు పనిచేయక బస్తీలు చీకట్లో మగ్గుతున్నాయని చెప్పారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా లైట్ల మరమ్మతులు, మార్పిడి పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చినప్పటికీ వేసవిలో ఉన్నట్లుగానే చివరి బస్తీలు, ఇళ్ల వరకు తాగునీరు అందడం లేదని, దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల నిర్మాణం, పెన్షన్ల మంజూరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలమైనా అర్హులకు పెన్షన్లు అందడం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపైనా ఆయన ప్రశ్నలు సంధించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు రూ.4,000 భృతి, యువతులకు స్కూటీలు, వివాహ సమయంలో తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైటెక్ సిటీ అభివృద్ధికే పరిమితమైందని ఆరోపించారు. సికింద్రాబాద్, అంబర్‌పేట్, సనత్‌నగర్, గౌలిగూడ, ఓల్డ్ సిటీ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారులు వెంటనే స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు