సిట్ నోటిస్‌పై కేసీఆర్ అభ్యంతరం..
ABN , Publish Date - Jan 31 , 2026 | 06:15 PM
జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాసి సిట్ నోటీస్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో నోటీసులు జారీ చేసిన విధానం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు..
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణను ఈ లేఖలో వివరించారు. ముఖ్యంగా నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ స్పష్టం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను.. వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నానని, అక్కడే విచారణ జరపాలని పోలీసులకు స్పష్టంగా తెలిపారు.
జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కేసీఆర్ పేర్కొన్నారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును లేఖలో ఉటంకించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకు, సీఆర్పీసీ సెక్షన్ 160 కింద జారీ చేసే నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు.
హరీష్ రావుకు జారీ చేసిన నోటీసుల విషయంలో పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈ తరహా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ వెల్లడించారు.
ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అక్రమ పద్ధతిలో జారీ చేసిన నోటీసులను విస్మరించే హక్కు తనకు ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తనకు సంబంధించిన నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. అలాగే ఏపీ హైకోర్టులోని వీడీ మూర్తి కేసు తీర్పును కూడా లేఖలో ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి...
కోఠి ఏటీఎం వద్ద కాల్పులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
ఘోరం.. ప్రియుడి భార్యను చంపేసిన ప్రియురాలు..
Read Latest Telangana News And Telugu News