కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన కవిత..
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:22 AM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్‌పై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు చేశారు. ఫాంహౌస్ వీడి కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
మేడ్చల్- మల్కాజిగిరి: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో రోజుల ఉత్కంఠకు నేటితో తెరపడింది. కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా ప్రకటించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై కవిత ఘాటు విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..'ఫాంహౌస్ వీడి కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నా. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. ప్రజల కోసం కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడ?. అధికారం వచ్చాక ఆయన మరకారం కోల్పోయారు. మారిన మరబొమ్మ కేసీఆర్. మాటల మనిషి, మర మనిషి, మారిన మనిషి కేసీఆర్. ఎక్కడ కష్టం వచ్చినా ఆ సారు రారు. గుంట నక్కల, తోడేళ్ల చేతిలో బందీ అయిన మనిషి. అదే మన కేసీఆర్ అయితే పాలమూరు దగ్గర కుర్చీ వేసుకుని మరీ పనులు పూర్తి చేసేవారు.
తెలంగాణ వదిలిపెట్టి కేసీఆర్ ఇతర రాష్ట్రాలు తిరిగారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజలే బయటకు లాగి సమాధానం చెప్పిస్తారు. కేసీఆర్ మారతారేమో అని చూశా. ఇళ్లు, భూములు అమ్ముకుని రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను ఏం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల మీద కర్రలతో దాడులు చేసిన వారికి పదవులు ఇచ్చారు. ఉద్యమకారులకి మర్యాద ఇచ్చారా?. కేసీఆర్ మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. మనకు ప్రాణాలు అడ్డంపెట్టి పోరాడే సైన్యం కావాలి. నేను ఏం తప్పు చేశానని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
కాళేశ్వరం మీద మాట్లాడితే సస్పెండ్ చేస్తారా?. అవినీతి చేసిన పందికొక్కులని కేసీఆర్ పక్కన పెట్టుకున్నారు. ఎదురుగా నిలబడి కొట్లాడతా.. నాతో కలిసి పోరాడుతారా?. ఇప్పుడు మనమే ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. మూడు పార్టీలు అవినీతి, బంధుప్రీతి, అధర్మంతో నిండిపోయాయి' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..
ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత