దర్యాప్తు చేయాల్సిందే
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:35 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
కాళేశ్వరంపై సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్
సీబీఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం
27న మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లే అవకాశం
ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనన్న క్యాబినెట్
సాంకేతిక అంశాలపైనే వ్యాఖ్యానించిన హైకోర్టు
సుప్రీంకు వెళ్లాలా? కమిషన్ గడువు పొడిగించాలా?
ఈ అంశంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం
రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయాలు
కేసీఆర్, హరీశ్‌లను నిర్దోషులని హైకోర్టు చెప్పలేదు
నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరె క్టర్‌ను కలవాలని నిర్ణయించారు. ఈ నెల 27న పలువురు మంత్రులతో కలిసి ఆయన ఢిల్లీకి వెల్లనున్నట్లు సమాచారం. సీఎం అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాగిన భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరంపై విచారణ కోసం ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయటాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు కొట్టివేయలేదని, పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాల ఆధారంగా మాత్రమే బుధవారం తీర్పునిచ్చిందని పేర్కొంది. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని అభిప్రాయపడింది. ముఖ్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రులు చర్చలు జరిపారు. సమావేశ నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలు మీడియాకు వెల్లడించారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసి, న్యాయ నిపుణులతో చర్చించి, తదుపరి చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఉపసంఘంలో తనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఉంటారని వెల్లడించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీఓ జారీ చేసి 9 నెలలైనా ఇంకా దర్యాప్తు ప్రారంభం కాలేదని విమర్శించారు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు తెలిపినట్లు చెప్పారు.
కేసీఆర్, హరీశ్ నిర్దోషులని కోర్టు చెప్పలేదు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలు తీసుకోరాదనిమాత్రమే హైకోర్టు చెప్పిందని, వారు నిర్దోషులని చెప్పలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ నివే దికను కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఎన్‌డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ మేడిగడ్డకు వచ్చారని మంత్రి తెలిపారు. ఎన్‌డీఎస్ఏ బీజేపీ సంస్థ కాదని, రాజ్యాంగ బద్ధ సంస్థ అనే విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ గుర్తించాలని సూచించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా? ఘోష్ కమిషన్ గడువు పొడిగించాలా? అనే అంశాలపై సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి తదితర న్యాయ నిపుణులతో ఉపసంఘం చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్‌డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్‌లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారసు చేసిందని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మించి ఉంటే, 16.50 లక్షల ఎకరాలకు సాగు నీరందేదని అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం నష్టం చేసిందని నివేదికల్లో ఉందన్నారు.
గుండెకాయ కుంగిపోయింది
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయలాంటిదని, అదే ఇప్పుడు కుంగిపోయిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లేనని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంతో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.20 వేల కోట్ల వరకు భారం పడుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో డి జైన్ చేసి నిర్మించి, వారి పాలనలోనే కుంగిపోయిన ఈ బ్యారేజీల డిజైన్లలోనే లోపం ఉందని ఎన్‌డీఎస్ఏ బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే చెప్పిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు రిపేర్ చేస్తే చాలన్న హరీశ్‌రావు సూచనపై ఉత్తమ్ మండిపడ్డారు. ‘మీ సలహాలు మాకు అవసరం లేదు. హరీశ్‌రావుకంటే తెలివైన వారు ఎన్‌డీఎస్ఏలో ఉన్నారు. బ్యారేజీ కూలిపోతే 44 గ్రామాలు, భద్రాచలం పట్టణం కొటుకుపోతాయి. బ్యారేజీలకు డ్యామ్‌లకు తేడా తెలియనివారు సలహాలిస్తున్నారు’ అని మండిపడ్డారు. బ్యారేజీల పునరుద్ధరణ చిత్తశుద్ధితో చేపడతామని తెలిపారు. జరిగిన నష్టానికి కారకులెవరో తేలాల్సిందేనని స్పష్టంచేశారు.