నీట్‌తో పాటు అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధం: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:20 PM
పార్లమెంట్‌లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సజావుగా జరగనివ్వ కుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యేలా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు.
న్యూఢిల్లీ, జులై 23: పార్లమెంట్‌లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సజావుగా జరగనివ్వ కుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యేలా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.
విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడిన వారిని ఎవరిని ఉపేక్షించమని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. పేపర్ లీకు తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. రాద్దాంతం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు.
విద్యార్థులతో కాంగ్రెస్, ఆప్‌లు రాజకీయం చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పార్లమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని కె. లక్ష్మణ్ వెల్లడించారు.