‘ఇందిరమ్మ బీమా’ లబ్ధిదారుల నమోదు షురూ
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:11 AM
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ)’లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది.
18 - 59 ఏళ్ల మధ్య వయస్కులకు పథకం వర్తింపు..
కుటుంబంలో ఒక్కరికే రూ.5 లక్షల బీమా
నమోదు ప్రక్రియకు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ)’లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. 23వ తేదీ నుంచి క్లస్టర్లవారీగా క్యాంపులను నిర్వహించి, లబ్ధిదారులను నమోదు చేస్తారు. మూడు నాలుగు గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల లబ్ధిదారుల నమోదు ఇక్కడే జరుగుతుంది.
కుటుంబాన్ని పోషించే వ్యక్తికి మాత్రమే రూ.5 లక్షల వరకు బీమా వర్తించనుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సంపాదించేవాళ్లు ఉంటే.. ఎవరికి బీమా ఇవ్వాలో ఆ కుటుంబమే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. మొదట రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన కుటుంబాల వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ‘సీప్’ సర్వే ఆధారంగా మొత్తం 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1967, నవంబరు 19 నుంచి 2008, నవంబరు 18 మధ్య జన్మించిన 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకానికి అర్హులని తెలిపింది.
లబ్ధిదారుల నమోదుకు మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీలవారీగా ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు క్యాంపుల ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)ల కమిషనర్లు ఈ పథకానికి నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్లు తమ జిల్లాలోని అదనపు కలెక్టర్లు, సీనియర్ అధికారులను జిల్లా స్థాయి అధికారులుగా నియమిస్తారు. వీరు మండల స్థాయి అధికారులతో సమన్వయం చేస్తారు. లబ్ధిదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, కుటుంబ వివరాలను సేకరించి.. ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి.
లబ్ధిదారుల నమోదు ఇలా...
వివరాల నమోదుకు క్యాంపు స్థాయిలో రిజిస్టర్‌ను ఉపయోగించాలి. సంబంధిత జిల్లా, మండలం, క్యాంపు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ పేరు లేదా వార్డు నెంబరును అందులో నమోదు చేయాలి. క్యాంపు నిర్వహించిన తేదీని వేయాలి. ప్రతి లబ్ధిదారునికి 1, 2, 3, 4... ఇలా క్రమ సంఖ్య ఇవ్వాలి. అందుబాటులో ఉన్న అధికారిక రికార్డుల ఆధారంగా లబ్ధిదారుడికి బీమా క్లెయిమ్‌కు సంబంధించిన లావాదేవీ ఐడీని ఇవ్వాలి. లబ్ధిదారుడి ఆహార భద్రతా కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) నెంబరును కూడా రిజిస్టరులో నమోదు చేయాలి. రికార్డులో లబ్ధిదారుడి పూర్తిపేరుతోపాటు వారి నామినీ పేరును కూడా స్పష్టంగా రాయాలి. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే 1, 2, 3, 4... అని విడివిడిగా నమోదు చేసి.. ప్రతి నామినీకి ప్రతిపాదించిన క్లెయిమ్ మొత్తాన్ని విడివిడిగా రాయాలి. ప్రత్యేక కాలమ్‌లో లబ్ధిదారుడి సంతకం తీసుకోవాలి. వివరాలను పరిశీలించిన అనంతరం క్యాంపు అధికారి సంతకం చేయాలి. ఆ తర్వాత వివరాలను సూపర్‌వైజర్ సరిచూసుకొని సంతకం చేయాలి.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..