Share News

ట్యాంకర్లకు తగ్గని డిమాండ్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:42 AM

వేసవికాలం పోయింది. వర్షాకాలం వచ్చి నెలరోజులు కావొస్తుంది. అయినా నగరంలో నీటి డిమాండ్‌ తగ్గట్లేదు.

ట్యాంకర్లకు తగ్గని డిమాండ్‌
Water Tankers, Demand

  • జూన్‌ చివరలో రోజుకు పదివేల బుకింగ్‌లు

  • 24 గంటలు గడిచినా రావట్లేదు

  • పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులు

  • వర్షాభావ పరిస్థితులతో నగరంలో ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ: వేసవికాలం పోయింది. వర్షాకాలం వచ్చి నెలరోజులు కావొస్తుంది. అయినా నగరంలో నీటి డిమాండ్‌ తగ్గట్లేదు. వాటర్‌బోర్డు ట్యాంకర్లను బుకింగ్‌ చేయగానే అదేరోజు డెలివరీ అయ్యే పరిస్థితి నగరంలో పలు ప్రాంతాల్లో లేదు. ఈ రోజు బుకింగ్‌ చేస్తే రేపు వస్తుందో.. ఎల్లుండి వస్తుందో అధికారులు సైతం స్పష్టతనివ్వడం లేదు.సాధారణంగా వేసవిలో మార్చి, ఏప్రిల్‌, మే నెలలో వాటర్‌ట్యాంకర్లకు డిమాండ్‌ ఉంటుండగా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జూలై వచ్చినా కానీ డిమాండ్‌ తగ్గడం లేదు. మండు వేసవిలో రోజుకు 10వేలకు పైగా బుకింగ్‌ వాటర్‌బోర్డుకు రాగా.. అదే ఇంకా కొనసాగుతోంది. జూన్‌ వస్తే నీటి డిమాండ్‌ నుంచి కొంత ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన నగరవాసులకు నిరాశే మిగిలింది.


ఆశించిన వర్షాలు లేక..

నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. మే నెల వరకు ఒక్క వర్షం కూడా కురవలేదు. ఇటీవల కురిసిన వర్షం భూగర్భ జలాలను పెంచేలా ప్రభావం చూపలేదు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున బోర్లు ఎండిపోయాయి. బోర్లు పని చేయకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసుల ఇంటి అవసరాలు తీరడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల మొదటి వారం వరకు ఆగుతూ పోస్తూ వచ్చిన బోర్లు ఒక్కసారిగా ఎండిపోయాయి. దీంతో గ్రేటర్‌ పరిధిలో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది.


కొందరు రోజు విడిచి రోజు ట్యాంకర్‌ బుక్‌ చేస్తుండగా, మరికొందరు రెండు రోజులకోసారి ట్యాంకర్‌ను బుకింగ్‌ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌, మే నెలలో తమకు కేటాయించిన కోటా మేరకు అపార్ట్‌మెంట్‌ వాసులు వాటర్‌బోర్డు ట్యాంకర్లను వినియోగించారు. కానీ, జూన్‌ నెలకు చేరేసరికి నెలకు వాడాల్సిన 8 ట్యాంకర్లు వారికి ఏ మేరకు సరిపోవడం లేదు. నగరంలో నెల క్రితం వరకు దాదాపు 12వేలకు పైగా అపార్ట్‌మెంట్‌ వాసులు వాటర్‌బోర్డు నీళ్ల కోసం ఎదురుచూడగా.. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. 10వేల లీటర్ల, 5 వేల లీటర్ల ట్యాంకర్లను పెద్దఎత్తున బుకింగ్‌ చేసుకుంటున్నారు.


city3.2.jpg24గంటలు గడిచినా.. రావట్లేదు

ట్యాంకర్లను బుక్‌ చేస్తే 24గంటల్లో డెలివరీ కావడం లేదు. పలుప్రాంతాల్లో ట్యాంకర్ల డెలివరీకి రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. ఒక్కో ఫిల్లింగ్‌ స్టేషన్‌లో 300లకు పైగా ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. నగరంలో దాదాపు 20 ఫిల్లింగ్‌ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అయితే, ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతంలో ఆదివారం వస్తే మార్కెట్‌ కావడంతో ఆ ప్రాంతంలో ట్యాంకర్ల డెలివరీ రోజంతా నిలిపివేస్తారు.


దాంతో మరుసటి రోజు డెలివరీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వెంగళ్‌రావునగర్‌ ప్రాంతంలోని ఫిల్లింగ్‌ స్టేషన్‌ వారంలో 24/7 నిర్వహణ చేసేందుకు అవకాశాలున్నా.. ట్యాంకర్‌ బుకింగ్‌ల డెలివరీ రెండు, మూడు రోజులు అవుతోంది. స్థానికంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బుకింగ్‌లపై ప్రభావం పడుతున్నట్లు తెలిసింది. తాగునీటి సరఫరా, ట్యాంకర్ల డెలివరీపై వాటర్‌బోర్డు అధికారులు మరో యాక్షన్‌ప్లాన్‌ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Updated Date - Jul 01 , 2026 | 08:42 AM