Share News

హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:54 PM

హైదరాబాద్‌ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భాగ్యనగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్
CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భాగ్యనగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సోమవారం) మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల తరలింపులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరాను విస్తరించాలని సూచించారు. నిర్మాణ పనులు, పార్కులు, గ్రీనరీ నిర్వహణ వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లోనూ గ్రీన్ వాటర్ సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


మరోవైపు, నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పక్కా ప్రణాళికలతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ, క్లౌడ్ శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు రూ.150 కోట్ల నిధుల మంజూరు

Updated Date - Nov 02 , 2026 | 05:00 PM