Share News

పహారాలో ఆర్థిక మంత్రి పేషీ!

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:16 AM

తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకొనేందుకు అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులను కలిసి తమ గోడు......

పహారాలో ఆర్థిక  మంత్రి పేషీ!

  • ఇది సచివాలయంలోని రెండో ఫ్లోర్‌! ఈ ఎర్రరిబ్బన్‌తో కూడిన బారికేడ్లు చూశారా? ఆర్థిక మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చాంబర్లవైపు కాంట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంగా ఏర్పాటు చేశారు. అక్కడ పహారాగా పోలీసులను పెట్టారు. ఇదంతా చూసి కాంట్రాక్టర్లు కంగుతింటున్నారు. బిల్లుల బకాయిలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసేందుకు వస్తే ఈ ‘అప్రకటిత నిషేధం’ ఏమిటి? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో బ్రిడ్జి పనులు, పశుసంవర్ధక శాఖలో చేప పిల్లల పంపిణీ పనులకు సంబంధించి ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు రోజూ ఈ ఫ్లోర్‌కు వస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అటువైపు వెళ్లాలంటే సీఎం కార్యాలయ సిబ్బంది, మంత్రుల పీఆర్వోలు, జర్నలిస్టులకూ వీలుపడటం లేదు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్‌ విభాగాల్ని పిలిపించి హడలెత్తిస్తున్నారు. మరి.. సీఎం చాంబర్‌ వద్ద కూడా లేని ఈ పహారా రెండో అంతస్తులోనే ఎందుకు? అనంటే కాంట్రాక్టర్ల బకాయిల సమస్యే కారణం అనితెలుస్తోంది. పెద్ద ఎత్తున బకాయిలు ఉండటంతో క్యూ కడుతున్న కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకే ఈ కట్టడి అని చెబుతున్నారు!

  • సచివాలయం రెండో అంతస్తులో పోలీసులు

  • ఎర్ర రిబ్బన్లతో మూడు వైపులా అడ్డుగా బారికేడ్లు

  • ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి చాంబర్లలోకి సందర్శకులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న వైనం

  • మీరెవరు? ఇక్కడేం పని? అంటూ రకరకాల ప్రశ్నలు

  • సందర్శకుల్లో కాంట్రాక్టర్లు, రిటైర్డ్‌ ఉద్యోగులే ఎక్కువ

  • బకాయిలు చెల్లిస్తే, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు ఇస్తే ‘పహారా’ అవసరమే ఉండదు కదా? అని నిరసనలు

  • ‘అప్రకటిత నిషేధం’పై సందర్శకుల్లో తీవ్ర అసహనం

  • రెండో అంతస్తుకు వెళ్లాలంటే సీఎంవో సిబ్బంది, మంత్రుల పీఆర్వోలు, జర్నలిస్టులకూ హడలే !

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకొనేందుకు అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులను కలిసి తమ గోడు చెప్పుకొంటారు. సచివాలయం రెండో అంతస్తులో మాత్రం ఇప్పుడీ పరిస్థితి ఏమాత్రం లేదు.


సందర్శకుల వెంట అనుమతి పత్రాలు ఉన్నా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మీరెవరు? వచ్చిన పనేంటి? అని వారిని రకరాలైన ప్రశ్నలు వేస్తూ వెనక్కి పంపించేస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ కోసం ఉద్యోగ విరమణ చేసినవారు, పింఛను రావడం లేదని వృద్ధులు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ వచ్చే గూడులేని అభాగ్యులు ఇలా వివిధ పనుల కోసం నిత్యం ఎంతో మంది సచివాలయానికి వస్తుంటారు. అందునా.. రెండో అంతస్తులో ఉన్న ఆర్ధిక మంత్రి చాంబర్‌కు వెళుతుంటారు. అయితే అక్కడ మంత్రి చాంబర్‌లోకి గానీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయంలోకి గానీ ఎవ్వరీనీ వెళ్లనీయడం లేదు. అక్కడ ‘అనధికారిక నిబంధనలు’ అమల్లోకి వచ్చాయి. మంత్రి చాంబర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేషీల వైపు రెండు అడుగులు కూడా వేసే వీలు లేకుండా తూర్పు, దక్షిణం, ఉత్తరంవైపు మూడు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ధర్నాలు, నిరసనలు తెలిపే చోట్లలో మాదిరిగా ఆ బారికేడ్లను ఎరుపురంగు రిబ్బన్లతో ఏర్పాటు చేసి.. పహారాగా సచివాలయం సెక్యూరిటీ విభాగానికి చెందిన పోలీసులను పెట్టారు. ఇప్పుడీ తీరు చర్చనీయాంశం అవుతోంది. బిల్లుల కోసం వస్తున్న కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం వస్తున్న పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పింఛను సమస్యలపై వచ్చే వృద్ధులు, ఇందిరమ ఇళ్ల దరఖాస్తుదారులు ఇలా ఎంతోమంది గుండెలనిండా ఆశలను నింపుకొని వస్తుంటే రెండో అంతస్తు దగ్గర పోలీసుల పహారా ఆ ఆశల్ని బారీకేడ్ల వద్ద తొక్కిపెడుతున్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఓ జాతీయ సంఘానికి చెందిన రాష్ట్ర విభాగం ప్రతినిధులు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కలవడానికి సచివాలయానికి వెళ్లారు. పోలీసులు వారినీ అడ్డుకొని హడావుడి చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రతినిధి బృందాన్ని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వద్దకు పంపారు.

4.jpg


ఎందుకీ సమస్య

వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక మంత్రి చాంబర్‌, ఆ శాఖ పిన్సిపల్‌ సెక్రటరీ చాంబర్‌కు వచ్చే సందర్శకుల్లో వీరే ఎక్కువగా ఉంటున్నారు. ఏళ్ల తరబడి తమ బిల్లులను పెండింగ్‌లో ఉన్నాయని.. వెంటనే క్లియర్‌ చేయాలంటూ సదరు కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో సచివాలయానికి వచ్చి డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో అక్కడే తీవ్ర నిరసన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ చాంబర్ల దగ్గరకు ఎవరూ వెళ్లకుండా ‘అడ్డుగా బారికేడ్లు-పోలీసుల పహారా’ కల్చర్‌ను అనధికారికంగా అమల్లోకి తెచ్చారు. సందర్శకుల్లో కొందరు ఇతర మంత్రుల పేషీల ద్వారా పేర్లు, వాహన నంబర్లు, ఇతర వివరాలు నమోదు చేయించి నేరుగా రెండో అంతస్తుకు వస్తున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ ఏర్పడుతోంది. అయితే ఎవ్వరినీ లోనికి అనుమతించకపోవడంతో కొన్నిసార్లు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఆ రెండో అంతస్తులో సందర్శకులకు తాగునీటి సౌకర్యం కూడా లేదు. సందర్శకుల్లో ఎవరైనా వాష్‌రూంకు వెళ్లాలని చెప్పినా ఆ వైపు అనుమతించడం లేదు. దీంతో మూడో అంతస్తుకో, కింద మొదటి అంతస్తుకో పరుగులు పెట్టాల్సి వస్తోంది. సచివాలయంలోని మిగతా ఐదు అంతస్తుల్లో లేని విధంగా రెండో అంతస్తులో అమలవుతున్న ‘అప్రకటిత నిషేధం’ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశంపై ఆర్ధిక శాఖ మంత్రి దృష్టి సారించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. సమయానికి తమ బిల్లులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పింఛన్‌లు ఇస్తే సచివాలయం వరకు వచ్చే అవసరం ఉండదు కదా అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి సమస్య పరిష్కారం కోసం వచ్చినవారిని నిలిపివేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు.

5.jpg


వారి కోసం ‘చుట్టూ తిరిగి’..

సచివాలయం రెండో అంతస్తులో దక్షిణం వైపు ఆర్థిక శాఖ మంత్రి, శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చాంబర్లు ఉండగా అదే అంతస్తులో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ చాంబర్లు, ఆ శాఖల పేషీలు ఉన్నాయి. వాకిటి, వివేక్‌ చాంబర్లవైపు వెళ్లాలంటే సందర్శకులు సాధారణంగా దక్షిణంవైపు లిఫ్ట్‌ ఎక్కి రెండో అంతస్తుకు వచ్చి.. ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌ మీదుగానే వెళతారు. అయితే అక్కడ బారికేడ్లు ఉండటంతో సమస్య ఎదురవుతోంది. దీంతో మొదటి అంతస్తుకు లేదా మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి మరో లిఫ్ట్‌ ద్వారా వాకిటి, వివేక్‌ చాంబర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల కొంతమంది దక్షిణంవైపు లిఫ్ట్‌ నుంచి రెండో అంతస్తుకు చేరుకొని వివేక్‌ చాంబర్‌వైపు వెళ్లాల్సి ఉందని చెప్పినా.. వారిని పోలీసులు వారిని అనుమతించలేదు.

Updated Date - Apr 23 , 2026 | 04:16 AM