Share News

క్యూనెట్ పిరమిడ్ మోసంపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:21 PM

క్యూనెట్ (QNET) పిరమిడ్ మోసం కేసులో హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గోవాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

క్యూనెట్ పిరమిడ్ మోసంపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..
Hyderabad QNET Scam

హైదరాబాద్‌: క్యూనెట్ (QNET) పిరమిడ్ మోసం కేసులో పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్‌–ఈఓడబ్ల్యూ (CCS-EOW) టీమ్-1 అధికారులు గోవాలో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.


కేరళకు చెందిన ఐదుగురు QNET ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్‌లను గోవాలోని నోవోటెల్ రిసార్ట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ నిర్వహించిన 'Ocean 25th Anniversary' ఈవెంట్ సందర్భంగా ఈ దాడులు జరిగాయి. పోలీసులను చూసి నిందితులు ముగ్గురు తప్పించుకున్నారు, వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

లగ్జరీ కార్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం

అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు మూడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో టయోటా ఫార్చ్యూనర్, కియా, ఎంజీ హెక్టర్ వాహనాలు ఉన్నాయి. అలాగే ఐదు మొబైల్ ఫోన్లు, కీలకమైన డిజిటల్ ఆధారాలను సీజ్ చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఇన్‌స్టాగ్రామ్ ద్వారా

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని వలలోకి దింపిన నిందితులు మంచి వ్యాపార అవకాశం ఉందని నమ్మించారు. తర్వాత భారీ ఆదాయం వస్తుందని చెప్పి రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే గోవాలో నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొనేందుకు రూ.30 వేల డిపాజిట్ కూడా వసూలు చేసినట్లు తెలిపారు.

కొత్త సభ్యులను చేర్చితే ఆదాయం అంటూ మోసం

QNET వంటి పిరమిడ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో కొత్త సభ్యులను చేర్చడం ద్వారా భారీ ఆదాయం వస్తుందని నిందితులు ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. జూమ్ మీటింగ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ బాధితులను ఆకర్షించినట్లు వెల్లడించారు. ఐటీ ఉద్యోగులు, యువత, గృహిణులు, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి మోసపూరిత స్కీమ్‌లు నడుస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు.


అప్రమత్తంగా ఉండాలి

పిరమిడ్ స్కీమ్‌లు, మనీ సర్క్యులేషన్ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. తక్కువ సమయంలో భారీ ఆదాయం వస్తుందని చెప్పే పథకాలను నమ్మవద్దని తెలిపారు. ఇలాంటి స్కీమ్‌లను ప్రచారం చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Also Read:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

వర్షాకాలం.. సలాడ్స్ తినడం మంచిదేనా?

Updated Date - Jul 23 , 2026 | 05:28 PM