Share News

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:42 PM

హైదరాబాద్‌లో పశువులు, మొబైల్‌ షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌ సిటీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్‌
CP Sajjanar On Interstate Theft Gang

హైదరాబాద్: పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి 15 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముఠాలో తబ్రేజ్‌ ఏ1 నిందితుడిగా ఉన్నాడని, పశువుల దొంగతనాల్లో తబ్రేజ్, రఫిక్ ప్రధాన పాత్ర పోషించారని వెల్లడించారు.


పండుగల సమయంలో పశువుల చోరీలు

రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నిందితులు పశువుల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నాగర్‌కర్నూల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా పశువులను చోరీ చేసేవారని సీపీ తెలిపారు. పశువులను సులభంగా తరలించేందుకు Xylazine అనే మత్తు ఇంజక్షన్‌ను ఉపయోగించి, వాటిని వాహనాల్లో ఎక్కించుకుని తరలించేవారని చెప్పారు. సాయి రెడ్డి అనే వ్యక్తి ఈ ఇంజక్షన్లను సరఫరా చేసేవాడని వెల్లడించారు.

పశువుల నుంచి మొబైల్ చోరీలకు..

రంజాన్, బక్రీద్ పండుగలు ముగిసిన తర్వాత నిందితులు మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడటం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. తబ్రేజ్, రఫిక్, ఫరహాన్ విజయవాడలోని బిగ్ సీ మొబైల్ షాపులో చోరీకి ప్రయత్నించగా అది విఫలమైంది. అనంతరం జూన్ 11న ఈ ముగ్గురు ఖమ్మంలోని సోనోవిజన్ మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డారని సీపీ తెలిపారు.

చోరీ చేసిన మొబైల్ ఫోన్లను మధ్యవర్తుల ద్వారా జావిద్ ఖాన్‌కు సుమారు రూ.20 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఖమ్మం పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లి అక్కడ కూడా మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడ్డారని సీపీ వెల్లడించారు.


చోరీ చేసిన ఫోన్లు బంగ్లాదేశ్‌కు

చోరీ చేసిన మొబైల్ ఫోన్లను విక్రయించడంలో కొందరు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఖాసీం అనే వ్యక్తి చోరీ చేసిన ఫోన్లను ముంబై, కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించేవాడని సీపీ తెలిపారు. అక్కడ వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేవారని చెప్పారు. ఈ వ్యవహారంలో హవాలా మార్గాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు.

మొబైల్ ఫోన్లను విదేశాలకు తరలించడం ద్వారా వాటి IMEI నంబర్లను ట్రాక్ చేయడం కష్టతరమయ్యేలా చేసేవారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 17న హైదరాబాద్‌లో మరో నేరానికి నిందితులు పథకం సిద్ధం చేస్తుండగా, నేరం జరగకముందే టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.


Also Read:

శుక్ర యోగం.. ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు.!

వేరుశెనగలు Vs పిస్తాలు.. ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయో తెలుసా?

Updated Date - Sep 19 , 2026 | 05:45 PM