ఏఐ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. రిపీటెడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు..
ABN , Publish Date - Jul 10 , 2026 | 07:52 PM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నగర పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నగర పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 80 క్రిటికల్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అలాగే ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయాలని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఆటోమేటిక్‌గా గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు తీర్మానించారు.
సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్‌పై నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనల్లో 99 శాతం రిపీటెడ్ వైలేషన్స్ ఉన్నట్లు వెల్లడించారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి వారిపై నిఘా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే ఓఆర్ఆర్‌పై వాహనాలు బ్రేక్‌డౌన్ అయినప్పుడు వాటిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు మధ్యలో వాహనాలను నిలిపివేయడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఆర్ఆర్‌పై వాహనాలు నిలపవద్దని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు.
వాహనం ఏదైనా కారణంతో ఆగిపోతే వెంటనే 14449 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హీరోగా పరిచయం చేస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం?..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..