Share News

Hyd Hot Air Balloon Fest: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్‌ బెలూన్ ఫెస్ట్.. మంత్రి జూపల్లి గగనవిహారం

ABN , Publish Date - Jan 16 , 2026 | 08:23 PM

హైదరాబాద్‌‌లో శుక్రవారం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. స్వయంగా గంటన్నర పాటు హాట్‌ఎయిర్ బెలూన్‌లో విహరిస్తూ గగనతలం నుంచి నగర అందాలను ఆస్వాదించారు.

Hyd Hot Air Balloon Fest: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్‌ బెలూన్ ఫెస్ట్.. మంత్రి జూపల్లి గగనవిహారం
Hyderabad hot air balloon festival

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం నేడు నగర ప్రజల ముందుకొచ్చింది. తెలంగాణలో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చేలా హాట్ ఎయిర్‌బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. గోల్కొండ కోట సమీపంలోని గోల్కొండ గోల్ఫ్ క్లబ్ పరిసరాల్లో ఈ ఫెస్ట్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి స్వయంగా హాట్ ఎయిర్‌ బెలూన్‌లో గంటన్నర పాటు ప్రయాణించి నగర అందాలను గగనతలం నుంచి తిలకించారు. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి మొదలైన మంత్రి జూపల్లి ప్రయాణం 13 కిలోమీటర్ల దూరంలో అప్పాజీగూడ శివారులో ముగిసింది(Minister Jupally Krishna Rao Inaugurates Hyderabad Hot Air Balloon Fest).

అనంతరం.. మంత్రి మీడియాతో మాట్లాడుతూ హాట్‌ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణం చిరస్మరణీయమని అన్నారు. ఈ ఫెస్ట్‌తో తెలంగాణ పర్యాటక రంగ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. పర్యాటకులకు కొత్త అనుభూతులను ఇచ్చే ఐడియాల అమలుకూ తాము సిద్ధమని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం సంప్రదాయం, సృజనాత్మకతను మేళవిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.


ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ లాంటి కార్యమాలు ఇప్పటికే రాష్ట్ర సాంస్కృతిక, ఆతిథ్య రంగ వైభవాన్ని గొప్పగా చాటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పర్యాటక రంగంలో రాష్ట్రం దూసుకుపోయేలా చేసేందుకు టెక్నాలజీ సాయంతో సాంస్కృతిక వైభవాన్ని చాటాలని అన్నారు. తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రపంచ వేదికల్లో ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోందనేందుకు గగనతలంలోని బెలూన్‌లు ఒక సంకేతమని వ్యాఖ్యానించారు. పిల్లలు, పెద్దలు, యువత వచ్చి ఈ ఫెస్టివల్‌ను ఆస్వాదించాలని కోరారు.


ఇవీ చదవండి:

బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయి: సీఎం

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీజీ బీజేపీ

Updated Date - Jan 16 , 2026 | 09:33 PM