Share News

ప్రజల్లోకి ముద్రిత నకిలీ ‘ఫామ్‌-7’ పత్రాలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:59 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు చోట్ల ఓటర్ల పేర్లు తొలగించారంటూ కొందరి పేర్లపై ముద్రించిన నకిలీ ‘ఫామ్‌-7’ పత్రాలు బయట పడ్డాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.

ప్రజల్లోకి ముద్రిత నకిలీ ‘ఫామ్‌-7’ పత్రాలు
Hyderabad fake Form 7

  • సమగ్ర విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం

  • ఆంధ్రజ్యోతితో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు చోట్ల ఓటర్ల పేర్లు తొలగించారంటూ కొందరి పేర్లపై ముద్రించిన నకిలీ ‘ఫామ్‌-7’ పత్రాలు బయట పడ్డాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. వాటిని తాము ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం ముషీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఈ ముద్రించిన ‘నకిలీ ఫామ్‌-7’ పత్రాలు లభ్యమైనట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారని సుదర్శన్‌ రెడ్డి ఆదివారం ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామన్నారు. సర్‌ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలంటే సదరు వ్యక్తిని ఎలక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌వో) విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారన్నారు.


ఓటరు జాబితా నుంచి ఫలానా వ్యక్తి ఓటును తొలగించాలంటే ‘ఫామ్‌-7’ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సదరు ఓటరుపై అనుమానం ఉంటే.. అది నకిలీ/ డూప్లికేట్‌ ఓటు అని భావించినా, ఓటరు మరణించినా, స్థానిక చిరునామాలో లేకపోవడం తదితర కారణాలతో చేతి రాతతో నింపిన ‘ఫామ్‌-7’తో ఫిర్యాదు చేయాలన్నారు. దాన్ని పరిశీలించిన అధికారులు నిజమని నిర్ధారణైతే ఆ ఓటరు పేరును తొలగిస్తారని స్పష్టం చేశారు. కానీ తొలగించాల్సిన ఓటర్ల వివరాలను ముద్రించిన ‘ఫామ్‌-7’లు కట్టలు కట్టలుగా తెచ్చి బీఎల్‌వోలకు ఇవ్వడం సరి కాదన్న సుదర్శన్‌ రెడ్డి.. నకిలీ ఫామ్‌-7 పత్రాలను ఎవరు తెచ్చినా బీఎల్‌వోలు అంగీకరించరన్నారు.


ఇటువంటి ముద్రిత పత్రాలను అధికారికంగా ఎన్నికల విభాగాలు నేరుగా బీఎల్‌వోలకు అందిస్తాయన్నారు. ప్రైవేటు వ్యక్తులు ముద్రించి ఇచ్చే పత్రాలను స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు ఈ పత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎవరు ముద్రిస్తున్నారు.. బీఎల్‌ఓలకు ఎవరు ఇస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టామన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని పలు నియోజక వర్గాల్లో బయట పడ్డ ఇలాంటి పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించినట్లు సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్‌!

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 06:59 AM