పోక్సో కేసులో లొంగిపోయిన బండి భగీరథ్..
ABN , Publish Date - May 16 , 2026 | 08:31 PM
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో కుటుంబ సభ్యులు బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌ను అడ్వకేట్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. చట్టం మీద గౌరవంతోనే భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే.. చట్టానికి అందరూ లోబడి ఉండాల్సిందే అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..'నా కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు ఆరోపణలు వచ్చాయి. చట్టాలపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పినా.. చట్టం ముందు నా బిడ్డ అయినా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టాలకి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్‌లో అప్పగిద్దామని అనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను నా కుమారుడు వారి ముందుంచాడు.
వాటిని చూసి కేసు కొట్టేస్తారని.. బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదని అనుకున్నా. ఆ ఉద్దేశంతో మా అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ.. న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దని విచారణకు అప్పగించా' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..
రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..