దళితులు నడిస్తే శుద్ధిచేస్తారా?
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:53 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్లను పసుపునీళ్లతో శుద్ధి చేయటంపై మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు నడిచారన్న కారణంతో రోడ్లను శుద్ధిచేసి, బీఆర్‌ఎస్ నేతలు తమ అసలు బుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శించారు.
ఇంకా ఎంతకాలం ఈ దాష్టీకం?: డిప్యూటీ సీఎం భట్టి
కేసీఆర్ వందేళ్లు బతకాలి...
ప్రతిపక్షనేతగా సేవలందించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
పసుపు నీళ్లతో శుద్ధిపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: అడ్లూరి
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్లను పసుపునీళ్లతో శుద్ధి చేయటంపై మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు నడిచారన్న కారణంతో రోడ్లను శుద్ధిచేసి, బీఆర్‌ఎస్ నేతలు తమ అసలు బుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు బుధవారం మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చీలికలు తీసుకురావాలని బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని భట్టి విమర్శించారు. ‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చావును సభ కోరుకోవడం లేదు. కేసీఆర్ చావాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఆ ఉద్దేశం మీకు(బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి) ఉండొచ్చు. కేసీఆర్ బతికుండాలని... బతికి ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి సేవలందించాలని కోరుకుంటున్నాం. సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ చేసి, మళ్లీ నిరసన తెలపటం ఏంటి? మీకు ఏం న్యాయం కావాలి? దళితులు నడిచారని పసుపు నీళ్లతో కడుగుతారా? ఎంతకాలం ఈ దాష్టీకం? నాగరిక సమాజంలోనే ఉన్నామా...? మీ సవాళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరు. ఇంకా మీ దొరతనం భరించడానికి సిద్ధంగా లేము. పసుపు నీళ్లతో రోడ్డు శుద్ధి చేయటంపై సభలో చర్చ జరగాల్సిందే’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ వందేళ్లు బతికుండాలని, ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి సేవలందించాలని కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుభ్రం చేయటంపై మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అసెంబ్లీలో ఇదే మాట చెప్పారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కానీ, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావే.. కేసీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేయించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం మాత్రం పోవటంలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మిత్రులని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తున్నారని... బీఆర్‌ఎ్‌సను బొందపెట్టే తాము ఇక్కడికి వచ్చామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దళితుల పేరు చెప్పి బీఆర్‌ఎస్ అధికారం సంపాదించి, చివరకు వారినే అణగదొక్కిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దళితుల అస్థిత్వం ముందుబీఆర్‌ఎస్ ఎంతటిదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు బట్టలు విప్పేసి చిల్లర చేతలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. తాతా మధు మాట్లాడింది ఆయన మాటలు కావని.. అవి కేసీఆర్ భావజాలం నుంచి వచ్చాయని విమర్శించారు. కేసీఆర్ ఫాంహౌజ్ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేయటం హేయమైన చర్య అని సీపీఐ శాసన సభాపక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆధునిక సమాజాన్ని ఆటవిక సమాజం వైపు తీసుకెళ్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.