నకిలీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సర్టిఫికెట్ల స్కామ్ గుట్టును రట్టు చేసిన పోలీసులు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:22 PM
నకిలీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సర్టిఫికెట్ల స్కామ్ గుట్టును అల్వాల్ పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, జూన్ 25: నకిలీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సర్టిఫికెట్ల స్కామ్ గుట్టును అల్వాల్ పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ వెల్లడించారు. పుష్పలత (A2), విశాల్ (A3), జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్ (A6)లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్ రూమ్ పత్రాలతోపాటు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని.. వాటిని సీజ్ చేశామన్నారు.
దాదాపు 100 మంది పేదల వద్ద రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వీరు నగదు వసూలు చేసినట్లు వివరించారు. తాను జీహెచ్ఎంసీలో సీనియర్ అధికారిని అని పేదలను పుష్పలత నమ్మించి.. ఈ మోసానికి తెర తీసిందని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 జయరాజ్ గంగాధరన్ మృతి చెందారని చెప్పారు.
ఈ కేసులో నిషా రాజ్ (A4), చింటూ రాజ్ (A5) పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. తిరుమలగిరి రాధాస్వామి జిరాక్స్ సెంటర్‌లోనే ఈ నకిలీ సర్టిఫికెట్ల డిజైన్, ప్రింటింగ్ జరిగిందని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో డబ్బులు అడిగే దళారులను నమ్మ వద్దని లబ్ధిదారులకు మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ సూచించారు.