Share News

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు

ABN , Publish Date - Aug 02 , 2026 | 08:58 AM

బియ్యం, పప్పులు, ఉప్పూ నూనెలు ఇప్పటికే బాగా పిరమైపోయాయ్‌! మార్కెట్లో కూరగాయాల ధరలూ అంతే!! నెలవారీ వంటింటి బడ్జెట్టు రెట్టింపవుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు! ముందర ఉంది మరింత కష్టకాలం! ఈ ధరల మంట మొబైల్‌ ఫోన్లు, టీవీలు, వాషింగ్‌ మెషిన్లు ఫ్రిడ్జ్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకూ పాకనుంది.

ఏం కొనేటట్టు లేదు..  ఏం తినేటట్టు లేదు
Essential commodity prices

  • పప్పులు, వంటనూనెలు సహా మండుతున్న నిత్యావసరాల ధరలు

  • ఇంటి సరుకుల బడ్జెట్‌ రెట్టింపు.. సామాన్యుల విలవిల

  • సౌందర్య ఉత్పత్తుల ధరలు పైపైకి.. మున్ముందు మొబైల్స్‌ పిరం

  • కొండెక్కనున్న టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాల ధరలు

  • పెరగనున్న వస్త్రాలు, గృహోపకరణాలు, కార్ల ధరలు

  • 6- 8 శాతం వరకు పెంచేందుకు సన్నద్ధమైన కంపెనీలు

  • వస్తువుల పరిమాణం తగ్గించడంపైనా దృష్టి

  • పశ్చిమాసియా సంక్షోభం, రూపాయి పతనమే కారణం

  • ముడిసరుకుల కొరత, రవాణా, ప్యాకింగ్‌ వ్యయాల భారాన్ని

  • వినియోగదారులపై వేయక తప్పట్లేదంటున్న కంపెనీలు

బియ్యం, పప్పులు, ఉప్పూ నూనెలు ఇప్పటికే బాగా పిరమైపోయాయ్‌! మార్కెట్లో కూరగాయాల ధరలూ అంతే!! నెలవారీ వంటింటి బడ్జెట్టు రెట్టింపవుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు! ముందర ఉంది మరింత కష్టకాలం! ఈ ధరల మంట మొబైల్‌ ఫోన్లు, టీవీలు, వాషింగ్‌ మెషిన్లు ఫ్రిడ్జ్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకూ పాకనుంది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): పండక్కి పరమాన్నం వండుకోవడమేమో గానీ.. పప్పన్నానికీ తిప్పలు మొదలవుతున్నాయి. అడ్డగోలుగా పెరిగిపోతున్న ధరలతో సామాన్యుల బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. పొద్దునలేవగానే ఉపయోగించే టూత్‌పేస్టు నుంచి వంటింట్లో బియ్యం, ఉప్పు, పప్పుల వరకు.. ఉదయమే తాగే టీ నుంచి టీవీల వరకు అన్నీ మరింత పిరం అవుతున్నాయి. ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గృహోపకరణాలు, వస్త్రాలు, ఫోన్లు, కార్లు.. ఇలా అన్నింటి ధరలు మరింత పెరగబోతున్నాయి. ఈ నెల నుంచే ఈ మోతమోగిపోనుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించగా.. మిగతా కంపెనీలన్నీ అదేబాటలో కసరత్తు చేస్తున్నాయి. ముడిసరుకుల ధరలతోపాటు రవాణా, ప్యాకింగ్‌ వ్యయం పెరగడంతో.. ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించక తప్పని పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ఏర్పడిన అనిశ్చితి, రూపాయి విలువ పతనం, ఎల్‌నినో ప్రభావం వంటివి కూడా ఈ పరిస్థితికి కారణమని అంటున్నాయి. కొన్ని విభాగాల్లో పెరుగుదల 6 నుంచి 8శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి.


అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడాయిల్‌) ధర పెరిగితే.. కేవలం వాహనదారులు, వంటగ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందే రోజులు పోయాయి. ఆధునిక వినియోగ ఆర్థిక వ్యవస్థలో క్రూడాయిల్‌ ప్రభావం దాదాపు ప్రతీ రంగంపై పడుతోంది. ముడిచమురు నుంచి ఉత్పత్తయ్యే పెట్రోకెమికల్స్‌ను ప్లాస్టిక్‌, ప్యాకేజీ, సింథటిక్‌ ఫైబర్‌, పెయింట్లు (రంగులు), డిటర్జెంట్లు, టైర్లు సహా అనేక ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. వాటి ధర పెరిగితే కంపెనీల్లో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దానికి రవాణా భారమూ తోడవుతుంది. చివరికి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. క్రూడ్‌తో మొదలయ్యే ధరల మోత కిరాణా బిల్లు దాకా వస్తుంది.


ధర పెంచడం లేదా పరిమాణం తగ్గించడం..

ఉత్పత్తి వ్యయం పెరగడంతో కంపెనీలు తమ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించకతప్పదు. ఇందుకోసం నేరుగా ధరలు పెంచడం లేదా సరుకుల పరిమాణాన్ని తగ్గించడం (ష్రింక్‌ ఫ్లేషన్‌)పై దృష్టిసారిస్తాయి. ధరలు పెంచితే నేరుగా తెలిసిపోతుంది. అలాకాకుండా ప్యాకెట్లలోని సరుకుల పరిమాణాన్ని స్వల్పంగా తగ్గిస్తే గుర్తించడం కష్టం ఉదాహరణకు ఒక బిస్కెట్‌ ప్యాకెట్‌ ధర రూ.10 ఉంటే దాన్ని కంపెనీ రూ.11కు పెంచకుండా.. ప్యాకెట్‌లోని బిస్కెట్ల బరువును తగ్గించవచ్చు. సబ్బు ధరను అలాగే ఉంచి బరువు తగ్గించవచ్చు. షాంపూ సాచెట్‌లో పరిమాణంలో కోతపెట్టవచ్చు. వినియోగదారులకు ఎక్కడా ధర పెరిగినట్టు కనిపించదని.. కానీ అందే సరుకు/వస్తువు పరిమాణం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చిల్లర గరిష్ఠ ధర (ఎమ్మార్పీ) మాత్రమేకాకుండా, బరువు, పరిమాణాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు.


పండుగల సమయంలో ప్రభావం..

ఒక వస్తువుపై పదిశాతం వ్యయం పెరిగితే పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు. కానీ పాలు, టీ, ఉప్పు, నూనె, సబ్బు, పేస్ట్‌, షాంపూ, డిటర్జెంట్‌, క్లీన ర్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ సహా ప్రతిదాని ధరలు పెరిగితే ఇంటి బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. దానికితోడు పెరిగిపోతున్న కూరగాయల ధరలు, స్కూల్‌ ఫీజులు, అద్దె భారం, రవాణా ఖర్చులు అన్నీ కలిస్తే బడ్జెట్‌ తలకిందులవుతుంది. పొదుపు అంచనాలు తారుమారవుతాయి. ఆగస్టు నుంచి నవంబరు వర కు భారత వినియోగ మార్కెట్‌కు కీలక సమయం. వినాయక చవితి, దసరా, ధన్‌తేరస్‌, దీపావళి వంటి పండుగలతో కొనుగోళ్లు పెరుగుతాయి. ఇళ్లకు పెయింటింగ్‌, కొత్త దుస్తులు, గృహోపకరణాలు, వాహనాలు, స్వీట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ కొనుగోళ్లు ఈ సమయంలోనే అధికంగా ఉంటాయి. ధరల పెరుగుదలతో వీటన్నింటిపైనా ప్రభావం పడుతుంది.


ధరల మోతకు సిద్ధం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే చాలా వరకు నిత్యావసరాలు, సరుకుల ధరలు పెరిగాయి. కానీ పరిస్థితి ఏమాత్రం చక్కబడకపోవడంతో మరోసారి ధరల పెంపు మొదలైంది. దేశంలో అతిపెద్ద వినియోగ వస్తువుల కంపెనీల్లో ఒకటైన హిందుస్థాన్‌ యూనిలీవర్‌ వచ్చే రెండు, మూడు నెలల్లో తమ ఉత్పత్తుల ధరలను దశలవారీగా పెం చనున్నట్టు తెలిపింది. మిగతా కంపెనీలూ అదే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలిచ్చాయి. పాల ధరలూ వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ ఇటీవలే 12శాతం వరకు ధరలు పెంచింది. మరోసారి పెంపును పరిశీలిస్తోంది. చాలా కంపెనీలు ఆగస్టులో మరో విడత మోతకు సిద్ధమవుతున్నాయి.


  • హావెల్స్‌ ఇండియా కొన్ని ఉత్పత్తుల ధరలను 8 శాతం వరకు పెంచింది. స్టీల్‌ ధరలు జనవరిలో టన్నుకు రూ.55 వేలలోపే ఉండగా.. ఇప్పుడు రూ.60 వేలు దాటింది. సిమెంట్‌ ధర పదిశాతం వరకు పెరిగింది.

  • పాల ధరలు లీటరుకు రూ. 2 నుంచి రూ.4 వరకు.. వంటనూనెలు బ్రాండ్‌ను, రకాన్ని బట్టి 14శాతం నుంచి 16 శాతం వరకు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం, పప్పుల ధరలు కూడా 20శాతం వరకు పెరిగాయి.

  • ఏసీ, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు 8 శాతం మేర పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల ధరలు 10-20శాతం వరకు పెరిగాయి.

  • మందుల తయారీకి వాడే ముడి రసాయనాల ధరల మోతతో.. జనవరి నుంచి ఆగస్టు మధ్య చాలా మందుల ధరలు పెరిగాయి.

  • మారుతీ సుజుకి సంస్థ కార్ల ధర రూ.30 వేల వరకు పెంచింది. మిగతా వాహన కంపెనీలూ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి

సాయికృష్ణ తల్లిని బెదిరించారా?

ఆగస్టు 4 నుంచి నీట్‌ కౌన్సెలింగ్‌

Updated Date - Aug 02 , 2026 | 09:25 AM