నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:44 PM
గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు.. తాజాగా హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.
హైదరాబాద్, జనవరి28: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసు(Nayeem money laundering case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు.. తాజాగా హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. మనీ లాండరింగ్ నివారణ చట్టం-2002 కింద ఈడీ ఛార్జిషీట్‌ను తయారు చేసింది. ఆ ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు( Rangareddy court) విచారణకు స్వీకరించింది.
నయీం తన గ్యాంగ్‌తో సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఈ కేసులో పాశం శ్రీనివాస్ తో సహా మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. మొత్తం 91 ఆస్తులను 'ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్'గా ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులు బలవంతంగా బాధితులను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లుగా ఈడీ అధికారులు ధ్రువీకరించారు. ఇక కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు విచారణకు హాజరుకాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకు సిద్ధమైంది.
అవసరమైతే నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు (NBW) జారీ చేయాలని కూడా కోర్టుకు విన్నవించినట్లుగా తెలుస్తోంది. అలానే ఈ కేసులోని 91 ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈడీ కోరింది. ఇప్పటికే బినామీ చట్టం కింద ఐటీ శాఖ అటాచ్ చేసింది. నయీంకు సహకరించిన కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు తాజాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను స్వీకరించిన నేపథ్యంలో నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.
Also Read:
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?
ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’