తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలి: ఆల్ పార్టీ మీటింగ్‌లో సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 13 , 2026 | 08:57 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, అందుకు అన్ని పార్టీల ఎంపీలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, అందుకు అన్ని పార్టీల ఎంపీలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అత్యంత కీలకమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు, రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలన్నారు. అలాగే హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)ను తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) భూసేకరణ దాదాపు పూర్తయిందని, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలైతే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అవసరమైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనుమతులు మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్ని పార్టీల ఎంపీలను సీఎం రేవంత్ కోరారు.
ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉందన్నారు. ఈ అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కేంద్రం కూడా చొరవ చూపితే త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 120 టీఎంసీలకు కేంద్ర అనుమతులు లభిస్తే సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని సీఎం పేర్కొన్నారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం తెలంగాణకు ప్రయోజనకరమని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే ఆ విషయాన్ని బహిరంగంగానే అంగీకరిస్తామని, అందులో తమకు ఎలాంటి రాజకీయ భేషజాలు లేవని స్పష్టం చేశారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు సంబంధించిన కేంద్ర అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయించేలా ఎంపీలు కృషి చేయాలన్నారు రేవంత్. ఆల్ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ప్రజాభవన్ నుంచి నేరుగా విమానాశ్రయానికి బయలుదేరారు. ఈరోజు రాత్రి ఢిల్లీ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ