Share News

అందరూ క్షేత్రస్థాయిలో..

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:37 AM

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

అందరూ క్షేత్రస్థాయిలో..

  • మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి మిగిలింది వారమే

  • సర్వేల్లో 90 శాతం కాంగ్రెస్‌కే సానుకూలం.. మునిసిపోల్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

  • ఇన్‌చార్జి మంత్రులు అందర్నీ కలుపుకొని వెళ్లాలి.. రెండ్రోజులకోసారి జూమ్‌లో భేటీ

  • మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష

  • వార్డుల్లో బీసీలకు 56ు ఇచ్చినట్లు లెక్క.. రెబెల్‌ అభ్యర్థులు 2ు లోపేనని గుర్తింపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. నాయకులను సమన్వయం చేసుకోవాలని, అందరూ ఐకమత్యంగా పనిచేయాలని మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రులు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని నాయకులను సమన్వయం చేసుకొని, ముందుకెళ్లాలని తెలిపారు. తాజా సర్వేల ప్రకారం మునిసిపాలిటీల్లో 90 శాతం మేరకు కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో మునిసిపల్‌ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తాము బాధ్యులుగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పార్టీ బలాలు, బలహీనతలు, అభ్యర్థుల వివరాలు, గెలుపు అవకాశాలతో కూడిన సమగ్ర నివేదికలను అందజేశారు. అదే సమయంలో సీఎం రేవంత్‌ తాజా సర్వే వివరాలనూ తెప్పించారు. నివేదికలన్నింటినీ సమీక్షించిన అనంతరం.. 90 శాతం మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందన్న అంచనాకు వచ్చారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు సొంత జిల్లాల్లోని నేతలనూ సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మంత్రులు, పార్టీ యంత్రాంగం వారం రోజులూ క్షేత్రస్థాయిలోనే ఉండి పనిచేయాలని ఆదేశించారు. పలు మునిసిపాలిటీల్లో నేతల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు సూచించారు. ఓట్లు చీలకుండా చూసుకునే బాధ్యతను మంత్రులు, స్థానిక నాయకులు తీసుకోవాలని చెప్పారు. కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకొని, గెలిపించే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని అన్నారు.


వారం రోజులూ మునిసిపల్‌ ఎన్నికలపైనే దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లు; ఆదిలాబాద్‌, మెదక్‌ మునిసిపాలిటీల్లో మరింత శ్రమించాలని సూచించారు. ఇకపై రెండురోజులకోసారి జూమ్‌ ద్వారా సమావేశమై సమీక్షించుకుందామని తెలిపారు. కాగా, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, డివిజన్లలో దాదాపు 56 శాతం మేరకు బీసీలకే కేటాయించినట్లు సమీక్షలో లెక్క తేల్చారు. అలాగే ఈ ఎన్నికల్లో రెబల్స్‌ బెడదను కనిష్ఠ స్థాయికి తగ్గించినట్లుగా గుర్తించారు. ఈ సమస్య 1-2 శాతం మధ్యలోనే ఉంటుందని తేల్చారు. టీపీసీసీతో సమన్వయం చేసుకొని, ఆ మాత్రం కూడా లేకుండా చూడాలని సీఎం రేవంత్‌ మంత్రులకు సూచించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లు హాజరు కాలేదు. వారు జిల్లా పర్యటనలో ఉన్నందున రాలేకపోయారని, వారితో ఫోన్‌లో మాట్లాడామని మహేశ్‌ గౌడ్‌ చెప్పారు.

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు పరిశీలకులు

మునిసిపల్‌ ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సేవలను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికలు లేని గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌ వంటి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లను ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు పరిశీలకులుగా పంపనున్నట్లు మహేశ్‌గౌడ్‌ వెల్లడించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో కోర్సును పూర్తి చేసిన సీఎం రేవంత్‌ను మంత్రులు సన్మానించారు.

నేడు మిర్యాలగూడకు సీఎం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, ఎస్పీ శరద్‌చంద్ర పవార్‌ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభకు హజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

బందోబస్తుకు వెళ్తూ.. ఇద్దరు కానిస్టేబుళ్లకు ప్రమాదం

సీఎం బందోబస్తు విధులకు వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మిర్యాలగూడ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు మదార్‌, సురే్‌ష తమ బైక్‌పై సీఎం సభాస్థలికి బయలుదేరారు. ఈదులగూడ చౌరస్తా వద్దకు చేరుకోగానే, వెనుకనుంచి వచ్చిన కంటైనర్‌ లారీ వీరి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మదార్‌ ద్విచక్రవాహనం పైనుంచి ఎగిరిపడటంతో తలకు బలమైన గాయమైంది. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. సురే్‌షకు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - Feb 04 , 2026 | 06:12 AM