మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Feb 14 , 2026 | 09:28 PM
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయడమే కాకుండా, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయడమే కాకుండా.. నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
మేయర్ పీఠమే లక్ష్యం: పొత్తులు, మద్దతుపై చర్చ
రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా, నిజామాబాద్, కొత్తగూడెంలలో మేయర్ పదవులను దక్కించుకోవడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్‌లో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం (MIM) పార్టీతో చర్చలు జరపాలని పీసీసీ చీఫ్‌కు సీఎం రేవంత్ సూచించారు. కొత్తగూడెంలో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని నిర్ణయించారు.
నమ్మకానికి నిదర్శనం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రులను, కార్యకర్తలను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను మా ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించింది. మా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయానికి పునాది' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని ఆయన కొనియాడారు.
మున్సిపాలిటీలకు కొత్త రూపం..
ఎన్నికల విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన అభివృద్ధి ఇప్పుడే మొదలవ్వాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు, మంత్రులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను, సంక్షేమ ఫలాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికలనూ ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?