ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం.. పాల్గొన్న సీఎం
ABN , Publish Date - Mar 28 , 2026 | 06:47 PM
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. తమ కేబినెట్‌లోనూ మంచి క్రీడాకారులు ఉన్నారన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఓ ఉపశమనం అని సీఎం చెప్పుకొచ్చారు.
'తెలంగాణ ఒకప్పుడు క్రీడల రాజధానిగా ఉండేది. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడా స్ఫూర్తి కనుమరుగైంది. మా ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి. గ్రామీణ స్థాయిలో సీఎం కప్ స్పోర్ట్స్ నిర్వహించాం. లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారు. మెస్సీ ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ దిగ్గజం. మెస్సీలాంటి ఆటగాడిని కాకుండా ప్రపంచ డ్రగ్ డీలర్‌ను పిలవాలా? రాజకీయపరంగా విమర్శలు చేస్తే పట్టించుకోను. బీఆర్ఎస్ నేతలు క్రీడలను ఎందుకు బహిష్కరించారో చెప్పాలి' అని రేవంత్ రెడ్డి అన్నారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 'యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు యత్నిస్తున్నాం. ఫామ్‌హౌస్‌లు, పబ్బులు వంటివాటికి యువత దూరంగా ఉండాలి. బీఆర్ఎస్ ఆలోచనలు ఫామ్‌హౌస్‌లు, పబ్బుల్లో పార్టీలు, విందులే' అని ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు రేవంత్. ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం సహా రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి నింపుతున్నామన్న ఆయన.. వారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు.
ఇవీ చదవండి:
చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం