Share News

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

ABN , Publish Date - Jul 07 , 2026 | 08:48 PM

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
CM Revanth Reddy

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అభ్యంతరం తెలిపిందని.. ఆ కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


కేసీఆర్ తనకు నచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.38 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. నివేదిక మారినా ఆయకట్టు ఏ మాత్రం మారలేదన్నారు. ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామన్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదికను ప్రజల ముందుంచామని రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తలపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


తుమ్మిడిహెట్టి ద్వారా తాగు, సాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుగా ఆనాడు నామకరణం చేశారని, 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించాలని ఆనాడే వైఎస్ఆర్, కాంగ్రెస్ కృషి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు.


కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదని, మానిప్యులేటర్లని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. అబద్ధాలతో మభ్యపెట్టడమే వారిద్దరి నైపుణ్యమని ఎద్దేవా చేశారు. ఆ విషయంలో వారికి వారే సాటి అని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తెలిపిందన్నారు సీఎం. అబద్ధాల రావుల మాటలను నాటి గవర్నర్ నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. డబ్బులు కొల్లగొట్టాలన్న ఆశతో ప్రాజెక్టును ప్రారంభించారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి మరీ యజ్ఞాలు చేశారని విమర్శించారు. కట్టిన ఏడాదిలోపే మేడిగడ్డ కుంగిపోయిందని, నాటి ప్రాజెక్టు ఏఈనే లోపాలను బయటపెట్టారన్నారు. సమస్యను గుర్తించకపోవడం వల్లే కూలిపోయిందని, 2022లో వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందన్నారు.


2023 అక్టోబర్‌లో ఆరు పిల్లర్లు కూలిపోయాయని, బ్యారేజీలు, డ్యామ్‌లు కడితే 25 శాతం చొప్పున నింపుతారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. అయితే, కేసీఆర్ మాత్రం కట్టిన ఏడాదికే బ్యారేజీలను నింపేశారన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద ఆయకట్టే లేదని, మేడిగడ్డను చూపించి బంగాళాఖాతాన్ని తెచ్చినట్టు చేశారన్నారు. నీళ్లు నింపడం వల్ల బ్యారేజీలపై ఒత్తిడి ఎక్కువైందని, ఇసుక మీదనే బ్యారేజీలు కట్టడం వల్ల ప్రాజెక్టు కుంగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 07 , 2026 | 08:57 PM