Share News

ఆయన దుర్మార్గుడైతే ఎందుకు చర్యలు తీసుకోరు: కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న

ABN , Publish Date - Feb 09 , 2026 | 06:37 PM

మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆయన దుర్మార్గుడైతే ఎందుకు చర్యలు తీసుకోరు: కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న

హైదరాబాద్, ఫిబ్రవరి 09: తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ ఆ పార్టీ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చిందా? అంటూ ఆ పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారన్నారు. కానీ హామీల అమలు గురించి మాత్రం చెప్పట్లేదంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఈ మేరకు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందన్నారు.


భవిష్యత్తును ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ఓటర్లకు సూచించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మనల్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనల్ని అవమానించడమే కాకుండా.. మళ్లీ ఓటు వేయాలని ఫడ్నవీస్‌ కోరారన్నారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో.. వరదల్లో మునిగిపోయిన వస్తువులన్నింటినీ తిరిగిస్తామని నాడు.. బండి సంజయ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆ వస్తువులకు బీమా ఉంటేనే వస్తాయంటూ ఆయన మాట మార్చారని సీఎం రేవంత్ అన్నారు.


మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా వారు తేలేదన్నారు. అలాగే హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణకు కేటాయించిన సెమీకండక్టర్‌ ప్రాజెక్ట్‌ను.. చివరి నిమిషంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌కు తరలించారంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై సీఎం రేవంత్‌ నిప్పులు చెరిగారు.


రాష్ట్ర పన్నుల వాటా తప్ప కేంద్రం తమకు ప్రత్యేకంగా ఇచ్చిందేమిటో చెప్పాలంటూ బీజేపీ అగ్రనేతలను నిలదీశారు. ప్రతి రూపాయి ట్యాక్స్‌పై 42 పైసలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని గుర్తుచేశారు. కర్ణాటక రూ.16 పైసలు, తమిళనాడు రూ.26 పైసలు మాత్రమే ఇస్తున్నాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందంటూ కేంద్రంపై మండిపడ్డారాయన. కుంభమేళాకు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తుంది. కానీ మేడారం జాతర, గోదావరి పుష్కరాలకు మాత్రం నిధులు ఇచ్చేందుకు ముందుకు రాలేదన్నారు. వరదలొచ్చినప్పుడు అదనంగా రూపాయి సాయం కూడా తెలంగాణకు చేయలేదని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. ఆ సమయంలో కేంద్రం తరఫున సాయం కోసం ఢిల్లీకి తాము తిరిగామని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.


రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్లే ఏకచ్ఛత్రాధిపత్యం సాగించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. గతంలో కీలక పదవులన్నీ కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ పేరు లేకుండా బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం ఉండదన్నారు. అసదుద్దీన్‌ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. అసదుద్దీన్‌ దుర్మార్గుడైతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ బీజేపీ అగ్రనేతలను సూటిగా ప్రశ్నించారు. ఎంఐఎంను భూతంగా చూపి ఎంతకాలం ఓట్లడుగుతారంటూ బీజేపీ నేతల వైఖరిని ఎండగట్టారు. మత రాజకీయాల ద్వారానే మనుగడ సాధిస్తుందంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు.


బీఆర్ఎస్ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఏర్పడిన దరిద్రానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీనేనని ఉద్ఘాటించారాయన. బీఆర్ఎస్‌ను యాసిడ్‌తో కడిగినా.. ఆ దరిద్రం పోదంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ఏనాడైనా సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించారా? అని కేసీఆర్‌ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటూ.. సభకు రారా? అంటూ బీఆర్ఎస్ అధినేతకు చురకలంటించారు. అలాంటి పార్టీకి ఓట్లు అడిగే అధికారం ఉందా? అని ఆ పార్టీ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి నగదు వసూలు చేశారని సీఎం ఆరోపించారు.


బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది విడదీయరాని బంధమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీకి బీఆర్‌ఎస్‌ నేతలు మద్దతివ్వలేదా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్రూమ్‌లు ఇచ్చారంటూ బీఆర్ఎస్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రెండేళ్లలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో జిరాక్స్‌ సెంటర్లలో ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన పత్రాలు దొరికాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 06:47 PM