జనవరి 10 నుంచి రాష్ట్రంలో స్వీయగణన
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:27 AM
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలో జనాభా గణన (ఫేజ్--2) నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
అదే నెల 25 నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాల నమోదు
68 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి
మొబైల్ యాప్ ద్వారా జనాభా వివరాల నమోదు
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలో జనాభా గణన (ఫేజ్--2) నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. జనవరి 10 నుంచి 24 వరకు పౌరుల స్వీయ గణన (స్వచ్ఛందంగా ఆన్లైన్లో నమోదు) నిర్వహించనుండగా.. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా జనగణన సంచాలకుల కార్యాలయం ఆధ్వర్యంలో 68 మంది మాస్టర్ ట్రైనర్లకు ఇచ్చిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం హైదరాబాద్‌లో గురువారం ముగిసింది.
సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, తెలంగాణ జనగణన సంచాలకురాలు భారతి హొలికేరి వీరికి ధ్రువపత్రాలు అందజేశారు. వీరికి తొలిరోజు జనగణన విధానం, ప్రాథమిక అంశాలు, చట్టపరమైన నిబంధనలు, జనాభా గణన షెడ్యూల్లోని మొదటి పది ప్రశ్నలపై అవగాహన కల్పించారు. రెండో రోజు 11 నుంచి 40 వరకు ప్రశ్నలు, జనాభా, సామాజిక, ఆర్థిక వివరాల సేకరణ, పున:పరిశీలన ప్రక్రియ, నిరాశ్రయుల గణన, స్వీయ గణన అంశాలను వివరించారు. మూడో రోజు జనాభా గణన కోసం రూపొందించిన మొబైల్ అప్లికేషన్ వినియోగంపై ప్రదర్శనలు, ప్రాక్టికల్ శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలపై అవగాహన కల్పించారు. నాలుగో రోజు ఎన్యుమరేషన్ బ్లాక్ మ్యాపుల రూపకల్పన, శిక్షణా పద్థతులు, కుటుంబాలతో మాట్లాడే విధానం, మాక్ శిక్షణ వంటి అంశాలను బోధించారు.
స్వీయ గణనపై ప్రత్యేక దృష్టి
2027 జనవరి 10 నుంచి 24 వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రకియ్రపైనా ప్రత్యేక దృష్టి సారించారు. కుటుంబాలు స్వయంగా తమ వివరాలను ఎలా నమోదు చేసుకోవాలన్న విధానంపైనా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ 68 మంది మాస్టర్ ట్రైనర్లు తదుపరి దశలో క్షేత్రస్థాయి శిక్షకులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..