Share News

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం: బండి సంజయ్..

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:09 PM

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రతి ఏటా బోనాల ఉత్సవాలకు ఎవరూ ఊహించలేనంత నిధులను ఖర్చు చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం: బండి సంజయ్..
Union Minister Bandi Sanjay

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రతి ఏటా బోనాల ఉత్సవాలకు ఎవరూ ఊహించలేనంత నిధులను ఖర్చు చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. లాల్ దర్వాజ సింహవాహిని బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.


కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని నేను దర్శించుకుంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హేళన చేశారు. నేడు కేటీఆర్‌కు జ్ఞానోదయమైంది. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో లాల్ దర్వాజ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. ప్రజలనే కాదు.. దేవుళ్లనూ మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. అందుకే ఆ పార్టీని ప్రజలు ఓడించారు.


లాల్ దర్వాజ బోనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5.50 లక్షలు మాత్రమే ఇచ్చింది. లక్ష మంది భక్తులు దర్శించుకునే ఆలయానికి ఆ పైసలు ఏ మూలకు సరిపోతాయి?. రంజాన్‌కు రూ.33 కోట్లు ఇచ్చి, 80 శాతం ఉన్న హిందువుల ఆలయాలకు రూ.20 కోట్లు మాత్రమే ఇస్తారా?. ఒవైసీ బాధపడతారనే సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. పాతబస్తీలో పన్నులు కట్టేది హిందువులే. మా పైసలు మాకు ఇవ్వడానికి ఏం నొప్పి?. నేను ప్రశ్నిస్తే మతతత్వవాది అని ముద్ర వేస్తారా?, పాతబస్తీ బరాబర్ హిందువులదే. హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే నాకు ముఖ్యం. నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.


హిందువులారా.. అందరం సంఘటితమై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మెడలు వంచుదాం. జెన్-జీ తరం ఉద్యమ, ఆధ్యాత్మిక స్ఫూర్తిని హిందువులు అర్థం చేసుకోవాలి. జెన్-జీ లారా.. హిందూ సంఘటితం కోసం ఉద్యమించండి. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలో బోనాల ఉత్సవాలను సకల సౌకర్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఊహించని విధంగా నిధులను ఖర్చు చేస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం. సనాతన ధర్మం కోసం పాటుపడే యువతరానికి శక్తిని ప్రసాదించాలని సింహవాహిని అమ్మవారిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్

పోలీసు శాఖలో మెరుగైన సంస్కరణలు తీసుకొస్తున్నాం:డీజీపీ సీవీ ఆనంద్

Updated Date - Aug 09 , 2026 | 04:11 PM