ఆటో మీటర్.. తొలి 1.6 కి.మీ.కు రూ.30
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:25 AM
రాష్ట్రంలో ఆటోల మీటర్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పెరిగిన ధరల నేపథ్యంలో మీటరు చార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇటీవల తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ మీటరు చార్జీల పెంపును ప్రధానంగా ప్రస్తావించారు.
ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14
ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆటోల మీటర్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పెరిగిన ధరల నేపథ్యంలో మీటరు చార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇటీవల తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ మీటరు చార్జీల పెంపును ప్రధానంగా ప్రస్తావించారు. ఇతర సమస్యల పరిష్కారంతోపాటు ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో చార్జీల పెంపుపై రవా ణాశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆటోరిక్షాల కనీస చార్జీని ప్రస్తుత రూ.20 నుంచి రూ.30కి పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. తొలి 1.6 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేసేలా కొత్త టారి్‌ఫను సూచించింది. ఆటో ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ప్రతి నిమిషానికి 75 పైసల డిటెన్షన్ చార్జీ విధించాలని ప్రతిపాదించింది. ప్రభు త్వం ఆమోదించి అధికారిక ఉత్తర్వు లు జారీ చేసిన తర్వాతే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం కొత్త టారి్‌ఫను ఆమోదిస్తే డిజిటల్ ఆటో మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా రీసెట్ చేసేందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని రవాణా శాఖ కోరింది. ఈ వ్యవధిలో ప్రతి ఆటోలో పాత, కొత్త చార్జీలను తెలిపే ఆమోదిత టారిఫ్ కార్డును ప్రదర్శించాలని ప్రతిపాదించింది.
అర్ధరాత్రి 50శాతంఅదనం..
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీపై 50ు అదనంగా వసూలు చేయాలని ప్రతిపాదించారు. ప్రయాణికుడితోపాటు ఉండే సా మానుకు ప్రత్యేక చార్జీ ఉండదు. అయితే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్ కాకుండా ఇతర ప్రతి ప్యాకేజీకి 50 పైసలు చొప్పున వసూలు చేయాలని సూచించారు. గరిష్ఠంగా 100 కిలోల సామానును అనుమతించాలని పేర్కొన్నారు. ఆటో నిర్వహణ వ్యయం, వాహన ధర, రుణానికి వడ్డీ, తరుగుదల, ఇంధన ధరలు, మరమ్మతులు, బీమా, పన్నులు, డ్రైవర్ ఆదాయం తదితర అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆటో నిర్వహణకు కిలోమీటరుకు రూ.13.53 ఖర్చవుతున్నట్లు లెక్కించింది. స్వల్ప వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూ.14 చేసి, కిలోమీటరు చార్జీగా సిఫారసు చేసింది. హైదరాబాద్‌లో ఆటో సగటు వే గాన్ని గంటకు 21 కిలోమీటర్లుగా అంచనా వేసింది.
12 ఏళ్లుగా మారని చార్జీలు..
ప్రస్తుతం ఆటో చార్జీలు 2014 ఫిబ్రవరి 14 నాటివి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అదే టారి్‌ఫను కొనసాగించారు. ప్రస్తుతం మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.11గా చార్జీ ఉంది. పన్నెండేళ్లుగా ఇవే చార్జీలు వసూలు చేస్తున్నారు. 2022లో ఆటో డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన కమిటీ మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.26, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.15గా పెంచాలని సిఫారసు చేసింది. అయితే ఆ ప్రతిపాదనపై అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు.