అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్.. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:45 AM
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డికి టీఐఈ హైదరాబాద్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.
హైదరాబాద్ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డికి టీఐఈ హైదరాబాద్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత వైద్య రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, దూరదృష్టితో కూడిన నాయకత్వం, వైద్య రంగంలో సంస్థల నిర్మాణానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2026 (హెచ్‌ఈఎస్-2026)లో ఈ పురస్కారాన్ని ఆయన తరఫున అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి అందుకున్నారు.
దేశ అవసరాలను గుర్తించి వాటికి పరిష్కారాలను అందించడమే నిజమైన పారిశ్రామికవేత్త లక్షణమని డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వైద్యం కోసం భారతీయులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉండాలన్న ఆలోచన నుంచే అపోలో ప్రారంభమైందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రతీ ఇంటికీ ఆరోగ్యం, ఆనందం అందించడమే తన ఆశయమని తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం, నాణ్యమైన వైద్య సేవలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడం అవసరమన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక