Share News

ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున..

ABN , Publish Date - May 12 , 2026 | 08:15 PM

తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని కోర్టు దృష్టికి నాగార్జున తీసుకెళ్లారు.

ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున..
Actor Akkineni Nagarjuna

హైదరాబాద్: తన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని కోర్టు దృష్టికి నాగార్జున తీసుకెళ్లారు. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం సదరు వ్యాపారిపై సీరియస్ అయ్యింది.


నాగార్జున టీ షర్టులు మీరెలా అమ్ముతారంటూ వ్యాపారిని హైకోర్టు ప్రశ్నించింది. ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారంటూ కోర్టు నిలదీసింది. తొలుత వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ 'ది ఘోస్ట్' సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్‌తో తమకు ఒప్పందం ఉందని.. నాగార్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని స్పష్టం చేశారు. దీనిపై నాగార్జున తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పంద పత్రాలు అడిగినప్పటికీ సమర్పించలేదని, కోర్టుకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలు సైతం అసంపూర్ణంగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


చివరికి, ఈ వ్యవహారంలో తమకు నాగార్జునతో కానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో కానీ ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని న్యాయస్థానం ముందు వ్యాపారి అంగీకరించారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నాగార్జున, ప్రొడక్షన్ హౌస్‌తో ప్రత్యక్ష ఒప్పందం లేదని మీరే అంగీకరిస్తున్నప్పుడు.. టీ షర్టులను విక్రయించే చట్టబద్ధత ఎక్కడి నుంచి వచ్చిందని సీరియస్ అయ్యింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

బీఆర్ఎస్ నేతలతో ఐదు గంటలుగా కొనసాగుతున్న కేసీఆర్ భేటీ

Updated Date - May 12 , 2026 | 08:31 PM