Share News

ఐదు దశల్లో ప్రజా పాలన - పట్టణ ప్రణాళిక

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:36 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఐదు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 6వ తేదీ నుంచి జూన్‌ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు.....

ఐదు దశల్లో ప్రజా పాలన - పట్టణ ప్రణాళిక

  • మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. శాఖలవారీగా 10 అంశాలపై దృష్టి

  • కలెక్టర్లతో సీఎం భేటీలో నిర్ణయాలు

  • యాక్షన్‌ ప్లాన్‌లో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలి : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఐదు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 6వ తేదీ నుంచి జూన్‌ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్‌ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్‌ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక.. ఇలా ఐదు దశల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ను అమలు చేయనున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం సహా శాఖలవారీగా 10 అంశాలపై(థీమ్‌) ఈ యాక్షన్‌ ప్లాన్‌లో దృష్టి సారించనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’పై ఆయాశాఖల ముఖ్యకార్యదర్శులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. శాఖలవారీగా 10 రకాల థీమ్‌లతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ప్రణాళిక శాఖ నోడల్‌ శాఖగా వ్యవహరిస్తుంది. ఈ నెల 6న ఉమ్మడి జిల్లాల్లో మం త్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తారు. ఈ 99 రోజుల్లో శాఖలవారీగా ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందించనున్నారు.


పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందాలి: సీఎం

కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందాలని ఆకాంక్షించారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాలవారీగా ప్రభుత్వం చేకూరుస్తోన్న లబ్ధిని ప్రజలకు వివరించాలని చెప్పా రు. రేషన్‌ కార్డుల పంపిణీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయడంలో భాగం గా వాటిని సమీపంలోని వైద్య కళాశాలలకు అనుసంధాన చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులను కచ్చితంగా చెల్లించాలన్నారు. ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలన్నారు.

కలెక్టర్లకు సీఎం చేసిన సూచనలు, ఆదేశాలు

  • 99రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, మునిసిపల్‌ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కా ర్పొరేటర్లు,మేయర్లను భాగస్వాములను చేయాలి.

  • అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేసి విధులపై అవగాహన కల్పించాలి.

  • సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ పంపుసెట్లకు బదులు సోలార్‌ పంపుసెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. ఇళ్లపైన సోలార్‌ ప్లాంట్లను అమర్చుకోవ డం, సోలార్‌ విద్యుత్తును వాడుకోవడంతో పాటు గ్రిడ్‌కు కనెక్ట్‌ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై గ్రామాల్లో విద్యుత్‌శాఖ అవగాహన కల్పించాలి.

  • గ్రామ, వార్డు సభల్లో కొత్తగా ఇచ్చిన రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి. వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయుల్లో కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించాలి.


  • రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల అనుసంధాన ఆస్పత్రుల సేవలు ప్రజలకు అందేలా చూడాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ఆస్పత్రులకే రిఫర్‌ చేయాలి.

  • ప్రతి ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుల ముఖ గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నైజేషన్‌) ప్రక్రియను చేపట్టాలి. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదు.

  • రవాణా శాఖ డేటా ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.

  • రోడ్లపై భారీస్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్‌ నెంబర్‌ను రవాణా శాఖ ఇవ్వాలి. ఆ నెంబర్‌కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్ల వెంట వ్యర్థాలను డంప్‌ చేస్తున్న వాహనాలను పట్టుకుని, జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. దీనికి ఓఆర్‌ఆర్‌ ఏజెన్సీని బాధ్యులను చేయాలి.

  • మూడు కార్పొరేషన్లతో పాటు నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు, బాలురు, బాలికల హాస్టళ్ల వివరాలను నమోదు చేసుకోవాలి.

  • పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్‌, ఈ-సిగరెట్ల వినియోగం ఉన్నట్లయితే.. అందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల, కళాశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్స్‌, పీఈటీ ఎలా ఉంటారో అలాగే సైకాలజిస్ట్‌ ఉండాలి.

  • వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేపట్టి సకాలంలో రైతులకు వాటి సమాచారాన్ని అందజేయాలి. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసేలా అన్నదాతలను ప్రోత్సహించాలి.

  • యూరియా యాప్‌ను రైతులు సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలి. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శనల ద్వారా రైతులకు చూపించాలి.

Updated Date - Mar 04 , 2026 | 04:23 AM