పండుగల వేళ నీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:15 PM
హైదరాబాద్లో పండుగల నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా.. సీవరేజ్ నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: నగరంలో పండుగల నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా.. సీవరేజ్ నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జలమండలి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.
ప్రధాన రహదారులు, ఉత్సవ ప్రాంతాల్లో సీవరేజ్ ఓవర్ఫ్లోలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్మిషన్ పైప్లైన్ లీకేజీల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అత్యవసర మరమ్మతులను వేగంగా పూర్తి చేయడంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంజీరా–సింగూరు నీటి లభ్యతపై అప్రమత్తంగా ఉంటూ ప్రత్యామ్నాయ నీటి సరఫరా ప్రణాళికలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు.. నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎండీ సూచించారు. నిర్మాణ రంగం, ల్యాండ్స్కేపింగ్ అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఎస్టీపీల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరవ్యాప్తంగా అదనంగా 500 వాటర్ ట్యాంకర్ల నమోదుతో పాటు బోడుప్పల్లో పెండింగ్ బుకింగ్ల పరిష్కారానికి మరో 50 ట్యాంకర్లను నమోదు చేయాలని సూచించారు. గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి, కొత్త కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని, నీటి వృథాను అరికట్టి శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక