విద్యార్థితో బలవంతంగా 'కల్మా' పఠనం.. యాజమాన్యం, టీచర్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:16 PM
హైదరాబాద్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి బాలుడితో బలవంతంగా కల్మా, సూరా ఫాతిహా పఠనం చేయించడం వివాదాస్పదమైంది. స్కూల్ డైరీలో దీనిని చదవాలని రాసి, తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఒత్తిడి తెస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జులై 17: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థితో బలవంతంగా ఇస్లామిక్ ప్రార్థనలు చేయించడం తీవ్ర సంచలనం రేపింది. క్లాస్ రూమ్‌లో సదరు బాలుడితో కల్మాలో భాగమైన సూరా అల్-ఫాతిహా పఠనం చేయాలని ఆదేశించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రోజూ దానిని చదవాలంటూ స్కూల్ డైరీలో 'సూరా అల్ ఫాతిహా' అని రాసి ఒత్తిడి తెచ్చారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రవర్తించడం వల్లే తమ కుమారుడు భయాందోళనకు గురై రోజూ ఏడుస్తూ ఇంటికి వస్తున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల వల్ల తమ మత స్వేచ్ఛతో పాటు తల్లిదండ్రుల హక్కులకు భంగం కలిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక(FIR) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, క్లాస్ టీచర్‌లను నిందితులుగా చేరుస్తూ.. భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 299తో పాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాలుడిపై మానసిక ఒత్తిడి తెచ్చిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని సైదాబాద్ పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News