Share News

మెట్రోపై మెలిక!

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:02 AM

మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ అంశంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. హైదరాబాద్‌ మెట్రో రైలుపై నెలన్నర క్రితం సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఒప్పందం...

మెట్రోపై మెలిక!

రూ.13,600 కోట్లు మీరే సేకరించుకోండి.. రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం

అడుగు ముందుకు వేయని ‘ఎస్‌బీఐ క్యాప్స్‌’.. రాష్ట్ర ప్రతినిధిగా జయేశ్‌ రంజన్‌

తమ ప్రతినిధిని ప్రకటించని కేంద్రం.. నెలన్నర అవుతున్నా పురోగతి శూన్యం!

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ అంశంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. హైదరాబాద్‌ మెట్రో రైలుపై నెలన్నర క్రితం సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఒప్పందం కార్యరూపం దాల్చకపోగా.. మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధుల రుణ సేకరణ బాధ్యతను మళ్లీ రాష్ట్రంపైనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణకు కావాల్సిన నిధుల అంచనా, రుణ సేకరణ కోసం ‘ఎస్‌బీఐ క్యాప్స్‌’ను కేంద్రం కన్సల్టెంట్‌గా నియమించింది. కానీ, ఈ అంశంపై ఎస్‌బీఐ క్యాప్స్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక మెట్రో విషయంలో కేంద్రంతో జరిపిన చర్చల మేరకు మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతినిధిని ప్రకటించలేదు. ఎస్‌బీఐ క్యాప్స్‌ ప్రతినిధి ఎవరన్నదీ తేలలేదు. హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్‌-1 ద్వారా తమకు ఆశించిన ఫలితాలు రాలేదని, నష్టాలు ఉన్నాయని ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. రెండో దశను విస్తరించాలంటే సాంకేతికంగా ఫేజ్‌-1ను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అందుకు రూ.13,600 కోట్లు కావాల్సి వచ్చింది. జపాన్‌కు చెందిన ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి తక్కువ వడ్డీకే రుణం తీసుకునేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణపై జూన్‌లో సీఎం రేవంత్‌ కేంద్ర మంత్రులతో చర్చించారు. ఒక్కో దశకు వేర్వేరుగా కాకుండా, రెండు దశలకు కలిపే రుణం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఐఆర్‌ఎ్‌ఫసీ నుంచి మంజూరైన రూ.13,600 కోట్ల రుణం నిలిచిపోయింది. దాని స్థానంలో రెండు దశలకు కలిపి ఎంత ఖర్చవుతుంది? ఎక్కడి నుంచి రుణం తేవాలి? తదితర విషయాలపై నివేదిక ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ‘ఎస్‌బీఐ క్యాప్స్‌’ను కన్సల్టెంట్‌గా నియమించారు. రెండు దశలకు అవసరమైన రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలను ఎంపిక చేయడం, రుణం మంజూరుకు మార్గం సుగమం చేయడం ఎస్‌బీఐ క్యాప్స్‌ బాధ్యతే. ఈ అంశంపై ఎస్‌బీఐ క్యాప్స్‌ రెండు నెలల్లోపే నివేదికను అందించాలని సూచించారు. కానీ, నెలన్నర గడిచినా ఒక్క అడుగూ ముందుకు పడకపోవడం గమనార్హం.


రుణ సేకరణ మార్గాలపై అన్వేషణ

జూన్‌లో జరిగిన చర్చల మేరకు హైదరాబాద్‌ మెట్రో విషయంలో కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదు. తాజాగా మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధులను రాష్ట్రమే సమీకరించుకోవాలన్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో రూ.13,600 కోట్ల రుణ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. గతంలో ఐఆర్‌ఎ్‌ఫసీ 4 శాతం వడ్డీకే రుణం ఇస్తామంది. తాజాగా అదే వడ్డీతో రుణం ఇచ్చే సంస్థల వైపు ప్రభుత్వం చూస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐతో పాటు మరికొన్ని బ్యాంకులను కూడా సంప్రదించనున్నట్లు తెలిసింది. ఐఆర్‌ఎ్‌ఫసీ రుణానికి కేంద్రం ఎన్‌వోసీ మంజూరు చేసి ఉంటే.. మేలోనే మెట్రో మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉండేది. కానీ, చివరి దశలో నిధుల మంజూరు నిలిచిపోవడంతో మెట్రో స్వాధీనం ఆలస్యమవుతూ వచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:02 AM