హైదరాబాద్‌లో యువకుడి మృతి కేసులో ట్విస్ట్.. సెక్షన్లు మార్చిన పోలీసులు
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:57 PM
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఏడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులే హత్య చేసి కిందకు తోసేశారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఏడో అంతస్తు నుంచి పడి ఆదిల్(24) అనే యువకుడు మృతి చెందిన ఘటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆదిల్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మాసబ్‌ట్యాంక్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. బుల్లెట్ బైక్ మరమ్మతుల విషయమై ఆదిల్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆదిల్ స్వయంగా ఏడో అంతస్తు నుంచి కిందకు పడి మృతి చెందలేదని వారు ఆరోపిస్తున్నారు. తన స్నేహితులే ఆదిల్‌ను హత్యచేసి అపార్ట్‌మెంట్ నుంచి కిందకు తోసేశారని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు.
సమాచారం అందుకున్న ఏసీపీ.. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని వారికి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిల్ మృతికి సంబంధించి ఐదుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తొలుత నమోదైన కేసులో సెక్షన్లను మార్చి.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. ఆదిల్ అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వెళ్లాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, ఏడో అంతస్తు నుంచి కిందపడటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్-1బీలో కొత్త మార్పులు.. వైట్ హౌస్ సమీక్ష పూర్తి! ఫీజులు పెరుగుతాయా?
టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు