Share News

హెచ్-1బీలో కొత్త మార్పులు.. వైట్ హౌస్ సమీక్ష పూర్తి! ఫీజులు పెరుగుతాయా?

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:31 PM

హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హెచ్-1బీలో కొత్త మార్పులు.. వైట్ హౌస్ సమీక్ష పూర్తి! ఫీజులు పెరుగుతాయా?
OIRA Reviews H1B visa Fee Hike Proposal

ఇంటర్నెట్ డెస్క్: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వలసల కట్టడే అజెండాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకెళుతున్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను తన ప్రధాన టార్గెట్‌గా మార్చుకున్నారు. రకరకాల మార్గాల్లో వీసా ఫీజులు పెంచి విదేశీయుల రాకను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వైట్‌హౌస్‌లోని ఆఫిస్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ) విభాగం ఈ ప్రతిపాదనపై సమీక్ష పూర్తి చేసినట్టు తెలిసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఈ ఫీజు పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం ట్రంప్ సర్కారు బహిర్గతం చేయలేదు. ఏ మేరకు ఫీజులు పెంచుతారన్నదాని గురించి ఎలాంటి వివరాలు బయటకురాలేదు. ఏయే రకాల హెచ్-1బీ వీసా పిటిషన్లకు ఈ ఫీజు పెంపు వర్తిస్తుందనేది కూడా ఇంకా తెలియరాలేదు. రాబోయే వారాల్లో డీహెచ్‌ఎస్ స్వయంగా ఈ ప్రతిపాదనను బహరింగ పరచనుంది. అనంతరం ప్రజల అభ్యంతరాలు స్వీకరించి ఆపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.


ఓఐఆర్ఏ సమీక్ష పూర్తైనంత మాత్రాన ఫీజుల పెంపునకు అనుమతి లభించినట్టు కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను, ప్రజల ముందు పెట్టాక వారి అభిప్రాయాల ఆధారంగా డీహెచ్ఎస్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై కోర్టులో చుక్కెదురైనా వెనక్కు తగ్గని ట్రంప్ సర్కారు ఇటీవల 9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని సంస్థలపై ట్రంప్ సర్కారు ఈ అదనపు భారం మోపింది. ఇవే కాకుండా, వీసా స్పాన్సర్ చేసే సంస్థలపై నిఘా మరింత కట్టుదిట్టం చేసేలా హెచ్-1బీ వీసాకు మరిన్ని మార్పులు చేసే యోచనలో ట్రంప్ సర్కారు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం 4,06,348 హెచ్-1బీ వీసా పిటిషన్లను ఆమోదించింది. వీటిలో 2,91,542 పిటిషన్లు వీసా పొడిగింపునకు సంబంధించినవి. ఇందులో భారతీయుల పిటిషన్ల వాటా 77.6 శాతం. ఈ నేపథ్యంలో మరోసారి వీసా ఫీజులు పెరిగితే భారతీయ ఉద్యోగులు అధికంగా ఉన్న టెక్ కంపెనీలకు ఖర్చుల భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

Updated Date - Aug 21 , 2026 | 04:45 PM