Share News

హైదరాబాద్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. 39 కిలోల గంజాయి సీజ్

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:43 PM

హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది. విశాఖపట్నం నుంచి ముంబైకి రైలు మార్గంలో 39 కిలోల గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని గాంధీనగర్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. 39 కిలోల గంజాయి సీజ్
Hyderabad Ganja Racket

హైదరాబాద్‌, ఆగస్టు 21: నగరంలో గంజాయి అక్రమ రవాణా ముఠాపై పోలీసులు కొరడా ఝళిపించారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నుంచి ముంబైకి రైలు మార్గంలో భారీగా గంజాయిని తరలించేందుకు యత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 39 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి బోయగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని రైలు మార్గంలో తరలిస్తూ నగరాన్ని ట్రాన్సిట్ పాయింట్‌గా ఉపయోగించుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.


అరెస్టైన ఐదుగురు నిందితులు తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి గంజాయిని సేకరించి ముంబైకి తరలించే క్రమంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడి చేసి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో నిందితుల పాత్ర ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

Updated Date - Aug 21 , 2026 | 09:54 PM