Share News

హైదరాబాద్ బొల్లారంలో డిటోనేటర్ల కలకలం.. 160 డిటోనేటర్ల స్వాధీనం

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:28 AM

హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉంచిన బకెట్‌లో ఏకంగా 160 డిటోనేటర్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది..

హైదరాబాద్ బొల్లారంలో డిటోనేటర్ల కలకలం.. 160 డిటోనేటర్ల స్వాధీనం
Bollaram Detonators

హైదరాబాద్‌, సెప్టెంబర్ 3: నగరంలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో భారీగా డిటోనేటర్లు లభించడం కలకలం రేపుతోంది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉంచిన బకెట్‌ను గుర్తించిన పోలీసులు.. తనిఖీలు చేపట్టగా అందులో ఏకంగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. బకెట్‌లో మొత్తం 8 బండిల్స్‌గా డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. డిటోనేటర్లు అక్కడికి ఎలా వచ్చాయి, వాటిని ఎవరు తీసుకొచ్చారు, ఏదైనా పేలుడు పదార్థాలతో సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇటీవల ఆయుధాలు మిస్సింగ్‌ అయిన కేసుకు సంబంధించి పోలీసులు బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ డిటోనేటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలోనే పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు లభించడంతో భద్రతాపరంగా పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. డిటోనేటర్లను బకెట్‌లో పెట్టి అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన బాంబ్‌ స్క్వాడ్‌.. డిటోనేటర్ల స్వభావం, వాటి వినియోగం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తోంది. ఆయుధాల మిస్సింగ్‌ కేసుతో ఈ డిటోనేటర్లకు ఏమైనా సంబంధం ఉందా? లేక మరేదైనా కారణంతో వాటిని అక్కడ ఉంచారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 09:55 AM