బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:40 PM
బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు.
జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..
నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..