నెల రోజుల పసికందు కిడ్నాప్.. ఒక్కరోజులో ఛేదించిన పోలీసులు
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:37 PM
గత కొంతకాలంగా శిశువులను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, శిశువును సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు.
హైదరాబాద్, జులై 18: గత కొంతకాలంగా శిశువులను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, శిశువును సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి ఒడిలో నుంచి నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపగా, పోలీసులు కేవలం ఒకే రోజులో పసిపాపను సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, పాపను పశ్చిమ బెంగాల్‌కు తరలించి విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులు రూ.1.50 లక్షలకు పసిపాపను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఆన్‌లైన్ ద్వారా ముందస్తు నగదు కూడా స్వీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చందానగర్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో వికారాబాద్, హైదరాబాద్, కోల్‌కతా ప్రాంతాల్లో నిందితుల కదలికలను గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం రక్షించిన పసిపాపను సురక్షితంగా కన్నతల్లికి అప్పగించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి శిశువును కాపాడిన చందానగర్ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు మరోసారి ప్రశంసలు తీసుకొచ్చారు. పోలీసులు ఈ ముఠాకు మరిన్ని రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు