Share News

హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:04 AM

హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపుతోంది. 12 అత్యాధునిక ఆయుధాలు, 1,912 తూటాలు, 21 మ్యాగజైన్లు మాయం కావడంతో ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
Hyderabad Weapon Theft

హైదరాబాద్‌, సెప్టెంబర్ 2: నగరంలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెజిమెంట్ ఆయుధాగారం నుంచి 12 అత్యాధునిక ఆయుధాలు, 21 మ్యాగజైన్లు, 1,912 తూటాలు, ఒక నైట్ విజన్ బైనాక్యులర్ మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై రక్షణ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించగా, మిలిటరీ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు బొల్లారం పోలీసులు సమాంతరంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆగస్టు 30 అర్ధరాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క వ్యక్తితో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను తరలించడం సాధ్యం కాదని, చోరీ వెనుక నలుగురికి పైగా వ్యక్తులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెజిమెంట్ వెనుక భాగంలో బలహీనంగా ఉన్న ప్రహరీ గోడను ఉపయోగించి ఆయుధాలను బయటకు విసిరేసి తరలించారా? లేదా ముందుగా రెజిమెంట్‌లోనే ఎక్కడైనా దాచి తర్వాత బయటకు తరలించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.


దర్యాప్తులో భాగంగా చోరీ జరిగిన రోజు తెల్లవారుజామున 3.48 గంటలకు మిల్కా సింగ్ మైదానం వద్ద అనుమానాస్పదంగా వేగంగా వచ్చి వెళ్లిన ఓ బైక్ సీసీ కెమెరాల్లో కనిపించింది. అయితే హెడ్లైట్ వెలుతురు కారణంగా బైక్ నంబర్ స్పష్టంగా నమోదు కాలేదు. ఆ బైక్‌కు ఈ చోరీతో సంబంధం ఉందా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఒక సిబ్బంది వద్ద జాగిలం ఆగడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రెజిమెంట్ ప్రహరీ సమీపంలోని గడ్డిలో ఒక మ్యాగజైన్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనలో రెజిమెంట్‌లోని సిబ్బంది సహకారం ఉందా? సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందా? అనే కోణాల్లోనూ విచారణ విస్తరించారు. ఘటన అనంతరం బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో హైఅలర్ట్ ప్రకటించగా.. కంటోన్మెంట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!

Updated Date - Sep 02 , 2026 | 11:10 AM