ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: హరీశ్ రావు
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:38 PM
సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలి డిమాండ్ చేశారు.
సంగారెడ్డి, నవంబరు 17: జిల్లాలోని నిజాంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లు..వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు సరిగా జరగడం లేదని ఆరోపించారు. నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతులు చివరకు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లకు బోనస్ చెల్లించడం లేదని.. ఇప్పటివరకు బోనస్‌పై జీవో విడుదల చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. క్వింటాల్ ధాన్యానికి పది కిలోల వరకు తరుగు తీస్తున్నారని.. మరోవైపు ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దళారులు ధరలు తగ్గిస్తున్నారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్‌పై వెంటనే జీవో విడుదల చేయడంతో పాటు అన్ని రకాల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా ప్రభుత్వం రైతులకు పరిహారం అందించలేదని హరీశ్ రావు ఆరోపించారు. కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయలేదని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తుంటే.. తెలంగాణలో మాత్రం రైతులకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. గతంలో వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇచ్చిందని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూడా ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. యాసంగి రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతుబీమా కొత్త విధానంలో కుటుంబానికి ఒక్కరికే కాకుండా అర్హులైన రైతులందరికీ ప్రయోజనం కల్పించాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!