Share News

సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 09:08 PM

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల‌తో సింగరేణి పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు
Singareni Coal Controversy

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల‌తో సింగరేణి పూర్తిగా నిర్వీర్యం అవుతోందని, 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితికి చేరుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ ఓబీ (ఓవర్ బర్డెన్) టెండర్లలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. సైట్ విజిట్ పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపి, ఓబీ టెండర్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క పాత్ర అత్యంత కీలకమని, ఆయన పర్యవేక్షణలోనే ఈ అక్రమాలు సాగాయని హరీశ్ రావు స్పష్టం చేశారు.


ప్రస్తుతం సింగరేణిలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోవడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో మాయమైన బొగ్గు ఎక్కడ ఉందో యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.1600 కోట్ల విలువైన బొగ్గును మాయం చేసి, దానికి పన్నులు ఎలా చెల్లించారో లెక్కలు తేలాల్సి ఉందన్నారు. అసలు తవ్వని బొగ్గుకు పన్నులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఏ ప్రాతిపదికన డీఎంఎఫ్‌టీ నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఒకప్పుడు లాభాల బాటలో పయనిస్తూ, కార్మికులకు అండగా నిలిచిన సింగరేణిని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చేసిందని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ అక్రమాల వెనుక అధికార పక్షానికి చెందిన పెద్దల హస్తం ఉందన్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు చెందిన శోధ కంపెనీ సైతం ఈ ఓబీ అక్రమాల్లో భాగస్వామిగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థను లాభాల బాటలో నడిపించాల్సింది పోయి, సింగరేణి థర్మల్ ప్రాజెక్టును కూడా క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పడిపోయిన ధరలు

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ

Updated Date - Jun 23 , 2026 | 09:17 PM