తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:03 AM
తెలుగు రాష్ట్రాలు సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు, పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 15,53,130 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం-చర్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్నపేట గ్రామం వద్ద కూడా జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది.
ములుగు జిల్లాలోనూ గోదావరి మహోగ్రరూపం దాల్చింది. మంగపేట మండలం రామన్నగూడెం సమీపంలో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీటి కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 24,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.536 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇక, ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు శనివారం సందర్శించనున్నారు. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం 10.60 అడుగులకు చేరి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువైంది. బ్యారేజ్‌లోని 175 గేట్లు ఎత్తి 8.65 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పలు కాజ్‌వేలు, రహదారులు నీటమునగగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం నాటు పడవలను అందుబాటులో ఉంచారు.
పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలోనూ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద నీటిమట్టం 40.4 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అలాగే కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్‌వేపైకి వరద నీరు చేరింది. ఎటపాక మండలం పోలిపాక వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో కూనవరం నుంచి భద్రాచలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం కుయిగూరు వద్ద రహదారిపైకి చీకటి వాగు వరద నీరు చేరడంతో ఒడిశా వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సోకులేరు వాగు పొంగిపొర్లడంతో చింతూరు-వీఆర్‌పురం రహదారిపైనా వరద నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
చంద్రబాబు కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన కారు
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పొడిగింపు