Share News

గచ్చిబౌలి టీఎన్‌జీవో సొసైటీలో అక్రమాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:53 AM

గచ్చిబౌలి (మణికొండ జాగీర్‌)లో టీఎన్‌జీవోల ఇళ్ల కోసం 2003లో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లను ఎటువంటి అనుమతుల్లేకుండానే అనర్హులకు కేటాయించారని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ఆరోపించింది.

గచ్చిబౌలి టీఎన్‌జీవో సొసైటీలో అక్రమాలు
CM Revanth Reddy

  • ఏసీబీ సమగ్ర విచారణకు ఆదేశించండి

  • అనర్హులకు ప్లాట్లు కేటాయింపులు

  • సీఎంకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి (మణికొండ జాగీర్‌)లో టీఎన్‌జీవోల ఇళ్ల కోసం 2003లో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లను ఎటువంటి అనుమతుల్లేకుండానే అనర్హులకు కేటాయించారని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి గురువారం ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. తుది లేఔట్‌కు హెచ్‌ఎండీఏ అనుమతి వచ్చే నాటికే 2011లో 622 ప్లాట్లను టీజీఎన్‌జీవో సహకార గృహ నిర్మాణ సంఘం కేటాయించిందని.. ఇందులో సొసైటీ సభ్యులు కానీ పోలీసు అధికారులు, సచివాలయంలోని సీనియర్‌ అధికారులు, వైద్యులున్నారని పేర్కొన్నారు. ప్లాట్ల లబ్ధిదారుల జాబితాను అందజేయాలని పలుమార్లు జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్‌ కోరినా సొసైటీ అధ్యక్షుడు ఇవ్వలేదన్నారు. ప్లాట్‌ పొందిన ప్రతి ఒక్కరి నుంచి అభివృద్ధి పేరిట వసూలు చేసిన రూ.4 లక్షల సొమ్ము దుర్వినియోగమైనట్లు తెలుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 622 ప్లాట్లకు 85 ప్లాట్లలో నిర్మాణాలు పూర్తి కాగా, 350 ప్లాట్లలో వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయని, మరో 187 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని పద్మనాభ రెడ్డి పేర్కొన్నారు.


టీఎన్‌జీవో సహకార గృహ నిర్మాణ సంఘంలో అక్రమాలపై ఏసీబీ/ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ రాసిన నివేదికను ఏడేళ్లుగా తొక్కి పట్టారని ఆరోపించారు. ఈ అంశంలో సహకార సంఘ కార్యవర్గ సభ్యులు, కొందరు సీనియర్‌ అధికారులు కుమ్మక్కై ప్రజా ధనాన్ని దోచుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. 2019 నుంచి పలు దఫాలుగా కలెక్టర్‌ నివేదికపై తీసుకున్న చర్యలేమిటో తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా ఆరా తీసినా.. ఫైల్‌ అధికారుల మధ్య సర్క్యులేషన్‌లో ఉందంటూ ఉద్దేశపూర్వకంగా సదరు ఫైల్‌ను మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై ఏసీబీ సమగ్ర విచారణ జరిపి.. అందుకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న పద్మనాభ రెడ్డి.. అనర్హులకు ఇళ్లస్థలాల కేటాయింపులను రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.2,500 కోట్లు ఉంటుందన్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకుని విక్రయిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 05:26 AM