Share News

రాజధానిలో బంకులు ఖాళీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:06 AM

పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని.. బంకుల్లో పెట్రోలు, గ్యాస్‌ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన....

రాజధానిలో బంకులు ఖాళీ

  • వదంతులతో అదనపు కొనుగోళ్లు

  • ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకుని.. క్యాన్లలో నింపుకెళ్లిన వాహనదారులు

  • అర్ధరాత్రి వరకు బంకుల వద్ద బారులు

  • కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌

  • పలు చోట్ల నో స్టాక్‌ బోర్డులు

  • రంగంలో దిగిన పోలీసులు

  • బైక్‌ సర్వీసులు, స్విగ్గి జొమాటో డెలివరీలపైనా ఎఫెక్ట్‌

  • కొరత లేదంటున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/పేట్‌ బషీరాబాద్‌/కుత్బుల్లాపూర్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని.. బంకుల్లో పెట్రోలు, గ్యాస్‌ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన వదంతులు.. మంగళవారం రాష్ట్ర రాజధానిలో అలజడి సృష్టించాయి. దీంతో ఆందోళన చెందిన వాహనదారులు ఉదయం నుంచే బంకుల వద్ద పెద్దఎత్తున బారులు తీరారు. ట్యాంకులు ఫుల్‌ చేయించుకోవడంతో పాటు.. పలువురు క్యాన్లలోనూ నింపుకెళ్లారు. దీంతో అనేక బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. మరికొన్నిటిని మూసివేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన జనం రోడ్లపై బంకుల కోసం వెతుకుతూ తెరిచి ఉన్న వాటిల్లోకి ఇష్టారాజ్యంగా వాహనాలతో చొరబడ్డారు. అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. వాగ్యుద్ధాలు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పెట్రోల్‌ బంకుల్లోకి వాహనదారులను పరిమితంగా వదులుతూ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించారు. అమీర్‌పేట, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, అబిడ్స్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు సేవలను నిలిపేశాయి. సాయంత్రం నాలుగు దాటిన తర్వాత టోలిచౌకి, బంజారాహిల్స్‌, లకడీకాపూల్‌, ఆసి్‌ఫనగర్‌, లంగర్‌హౌస్‌, బండ్లగూడ, ఎర్రగడ్డ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని బంకుల వద్దకు సైతం వాహనదారులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు బంకుల ముందు బారులు తీరారు.


బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఐఓసీ పెట్రోల్‌ బంకు తెరిచిఉండటంతో అక్కడా రద్దీ ఏర్పడింది. రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వచ్చేదని, ఇప్పుడు ఐదు రోజులకు ఒకటి కూడా రావడంలేదని బంకుల నిర్వాహకులు తెలిపారు. గ్యాస్‌ ఏజెన్సీలు, బంక్‌ల నిర్వాహకులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారంటూ పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

పలు రంగాలపై ప్రభావం

పెట్రోల్‌ కొరత లేదని ప్రభుత్వం, పోలీసు అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ఆ ప్రభావం మంగళవారం సాయంత్రానికి నగరంలోని వివిధ రంగాలపై చూపించింది. బైక్‌ సర్వీసులైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలు బుక్‌ అవడంలేదు. రెండు కిలోమీటర్ల దూరానికి బైక్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించినా ఎక్కువ ధర ఇస్తామన్నా స్పందన లేదు. మరోవైపు ఫుడ్‌ డెలివరీ యాప్‌లు స్విగ్గి, జొమాటోల ద్వారా ఫుడ్‌ ఆర్డర్లు ఇచ్చినా, అందులో సగానికి పైగా ఆర్డర్లు రిజెక్ట్‌ అవుతున్నాయి. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీ నుంచి ఓ వృద్ధుడు అపోలో ఆసుపత్రికి వెళ్లడానికి ఆటో, కారు, బైక్‌ ఏదీ ప్రయత్నించినా ఆయనకు సర్వీస్‌ లభించలేదు.

నగరంలో ఇంధన కొరత లేదు

హైదరాబాద్‌లో పెట్రోలు, ఎల్‌పీజీ కొరత లేదని సరిపడా స్టాక్‌ అందుబాటులో ఉందని హైదరాబాద్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ శ్వేతారెడ్డి స్పష్టం చేశారు. చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితి సమీక్షిస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొదని ఆమె ప్రజలను కోరారు. ఇంధనాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- జాయింట్‌ పోలీసు కమిషనర్‌ శ్వేతారెడ్డి

Updated Date - Mar 25 , 2026 | 04:07 AM