హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:55 AM
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, లాభాల కోసం కల్తీ ముఠాలు రోజురోజుకూ బరితెగిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని రామంతాపూర్‌లో ఇలాంటి ఘోరమైన ఘటనే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, జులై 15: నగరంలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు ఆకస్మికంగా మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, వివిధ రకాల ఫ్లేవర్లను ఉపయోగించడంతో పాటు, పూర్తిగా ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుండటం ఇక్కడ కలకలం రేపింది.
ఈ దాడిలో ఎలాంటి లేబుళ్లు లేని ముడి పదార్థాలు, భారీ మొత్తంలో లూజ్ టూటీ ఫ్రూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుండి కల్తీ ఐస్‌క్రీమ్‌లను స్థానికంగా ఉండే పలు దుకాణాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ నిర్వాహణకు బాధ్యుడైన ఐస్‌క్రీమ్ యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రంలోని భారీ కల్తీ ముడి పదార్థాలను సీజ్ చేసి, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
నియంత్రణలో ఖర్చులు తగ్గిన మూలధన వ్యయం