హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:57 AM
హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడవటంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. ఈ మిసైల్ దాడుల కారణంగా ట్యాంకర్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
మళ్లీ దిగ్బంధనం..
కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబడుతోంది. గత కొద్దిరోజుల నుంచి ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది. అమెరికా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని విధించింది. రెండు దేశాల మధ్య ఒప్పందం కారణంగా దిగ్బంధనాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇప్పుడు పరిస్థితులు మొదటికి రావటంతో.. దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.
కాగా, మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ తీర ప్రాంతాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. బుషెహర్, చబహార్, జాస్క్, కొనారక్, అబు మూసా, బందర్ అబ్బాస్ పట్టణాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, లాంఛర్లను, పోర్టుల్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారని.. ఎప్పుడైనా, ఏ స్థాయి దాడికైనా తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..